నర్సాపూర్, ఆగస్టు 11: చెరువు కాల్వను పునరుద్ధరించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని రాయారావు చెరువు పంట కాల్వను ఆమె పరిశీలించి వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా నర్సాపూర్‌లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. పాతకాలంలో కట్టిన మురుగు కాల్వల వల్ల వర్షపు నీరు బయటకు వచ్చి ఇండ్లలోకి చేరిందన్నారు.
చెరువు కాల్వ కూడా ఊరు మధ్య నుంచి ఉండడం వల్ల ఇండ్లల్లో నీరు నిలిచిందన్నారు. పంట కాల్వను పునరుద్ధరించాలని మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ అధికారులను ఆమె ఆదేశించారు. నర్సాపూర్ పట్టణంలోని కోమటికుంట కాల్వ కబ్జాకు గురైందని, గతంలో కుంట కాల్వ ఎలా ఉందో అలాగే పునరుద్ధరించాలన్నారు. అభివృద్ధికి సంబంధించిన నిధులను ప్రభుత్వం నిలిపివేసిందని, తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో మదన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 35 ఎకరాల అటవీ భూమిని అభివృద్ధి నిర్మాణాలకు తీసుకున్నామని, దాన్ని సర్వే చేస్తే రెవెన్యూ భూమిగా తేలిందన్నారు. అంతకు ముందు జాతీయ నూలి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. అనంతరం రాఖీ పండుగను పురస్కరించుకొని విద్యార్థులు ఆమెకు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్చరణ్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు షేక్‌హుస్సేన్, నర్సింహులు, ప్రసాద్, రాకేశ్‌గౌడ్, అధికారులు పాల్గొన్నారు.