సిద్దిపేట జిల్లా పూర్తిస్థాయిలో పొద్దుతిరుగుడు పంటను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మార్చిలో 7 పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి కేంద్రం ప్రభుత్వం విధించిన టార్గెట్ మేర మాత్రమే పంటను కొన్నారు. కానీ, ఇంకా చాలామంది రైతుల సన్‌ప్లవర్ పంట కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం కురిసిన వర్షానికి పలుచోట్ల పంట తడిసిపోయింది. ప్రభుత్వ నిర్ణయం కోసం రైతులు కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నారు.
గజ్వేల్, ఏప్రిల్ 4: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, చిన్నకోడూరు, బెజ్జంకి, హుస్నాబాద్, కట్కూర్లో మార్చిలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. జిల్లాలో 2 వేల మంది రైతులు 12 వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగుచేశారు. జిల్లాలో 18,360 క్వింటాళ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. జిల్లాలోని గజ్వేల్, తొగుట, చిన్నకోడూరు. బెజ్జంకి, కట్కూర్ల్లో ఇచ్చిన టార్గెట్ పూర్తవడంతో కొనుగోళ్లను అధికారులు నిలిపివేశారు.
సిద్దిపేట, హుస్నాబాద్ కేంద్రాల్లో శుక్రవారం కొనుగోళ్లు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలోని 7 కొనుగోలు కేంద్రాల ద్వారా 1653 మంది రైతుల నుంచి 17,928 క్వింటాళ్ల పొద్దుతిరుగుడును క్వింటాల్‌కు రూ.7280 ధరకు కొనుగోలు చేశారు. ఇంకా ఏడు కేంద్రాల్లో కొనుగోళ్లకు పొద్దుతిరుగుడు సిద్ధ్దంగా ఉంది. అయినా అధికారులు కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు రోడ్ల పైకొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. గురువారం తొగుట మండల కేంద్రంలో రైతులు పొద్దుతిరుగుడును రోడ్డుపై పోసి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో షెడ్ కింద రైతులు పొద్దుతిరుగుడును అమ్మేందుకు తీసుకొచ్చి పెట్టారు. గురువారం కురిసిన భారీ వర్షంతో షెడ్ కిందకు నీళ్లు రావడంతో తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేకాని తిరిగి పొద్దుతిరుగుడు కొనుగోళ్లు చేసే పరిస్థితి కనిపించడం లేదు. కొద్ది రోజులుగా రైతులు పొద్దుతిరుగుడును కేంద్రాలకు తెచ్చి పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లా లో మరో 6వేల క్వింటాళ్ల పొద్దుతిరుగుడు కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయలు లేకపోవడంతో చాలామంది రైతులు ఇంటి వద్దనే పంటను ఉంచారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో సిద్ధ్దంగా ఉన్న పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తాం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేశాం. ఇంకా జిల్లాలో పొద్దుతిరుగుడు కొనుగోలుకు సిద్ధ్దంగా ఉంది.
– క్రాంతి, మార్క్‌ఫెడ్ డీఎం సిద్దిపేట