Summer | రామాయంపేట, ఫిబ్రవరి 18 : వేసవి ప్రారంభానికి ముందే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో మట్టి కుండలు, రంజన్లకు గిరాకీ పెరిగింది. ఇంట్లో ఫ్రిజ్‌లేని నిరుపేదలు ఈ మట్టి కుండలు, రంజన్లలోని చల్లటి నీటిని తాగుతూ సేద తీరుతున్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో పేదోళ్లే కాకుండా ఇంట్లో ఫ్రిజ్ ఉన్న వాళ్లు కూడా రంజన్లకే మొగ్గుచూపుతున్నారు. ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి వంటి వ్యాధుల బారిన పడుతుండటంతో కుండలో నీటిని తాగేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా తూప్రాన్, రామాయంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట, మనోహరాబాద్ తదితర మండలాల్లో రంజన్లు, మట్టికుండల విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కుండల విక్రయాలు కనిపిస్తున్నాయి.
గతంలో మార్చి మొదలయ్యాక ఎండలు దంచి కొట్టేవి కాని ప్రస్తుతం ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. రాత్రంతా చల్లగా ఉన్నా పొద్దంతా వేడితో జనాలు విలవిలలాడుతున్నారు. దీంతో దాహార్తిని తీర్చుకునేందుకు రంజన్లు, మట్టి కుండలను కొని ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో వీటి గిరాకీ భారీగా పెరిగిపోయింది. రామాయంపేట మండల కేంద్రంలో ఒక్కో రంజన్‌కు రూ.100 నుంచి రూ 250 వరకు ధర పలుకుతుంది. ఇక నల్లాను బిగించి ఇస్తే మరో 50 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. డబ్బులు ఎక్కువ పోయినా తాగేందుకు అనువుగా ఉంటుందని నల్లా ఉన్న మట్టి కుండలను తీసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితితో పేదోడికి రంజన్‌లతో దాహం తీరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వారం నుండి విక్రయాలు బాగానే ఉన్నాయి : ఎండీ బాబా, దుకాణ యజమాని
ఈ సంవత్సరం ముందే ఎండలు ఎక్కువగా ఉన్నందున రంజన్ల గిరాకీ కూడా బాగానే ఉంది. రామాయంపేట, చుట్టుప్రక్కల మండలాల వారు కూడా పరిచయం మీద వచ్చి రంజన్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకైతే నాకు ఈ సీజనల్ వ్యాపారాలు బాగున్నాయి. ఆర్థికంగా పిల్లా పాపలతో సంసారాన్ని నిలదొక్కుకుంటున్నా.