జహీరాబాద్, నవంబర్ 9: చెరుకు సాగుకు పేరుగాంచిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులకు కొన్నేండ్లుగా తీపి కరువైంది. జహీరాబాద్ నియోజకవర్గంలోని కొత్తూర్ (బీ) గ్రామ శివారులోని ట్రైడెంట్ ఫ్యాక్టరీ మూతపడడంతో పండించిన చెరుకును ఇక్కడి రైతులు ఇతర ప్రాంతాలకు తరలించాల్సిందే. దీంతో దూరభారం కానుండడంతో పాటు మద్దతు ధర దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రాయికోడ్ మండలంలోని గోదావరి ఫ్యాక్టరీపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది ఈ ఫ్యాక్టరీ 1.15 లక్షల టన్నుల చెరుకును మాత్రమే క్రషింగ్ చేయడంతో రైతులు నిరాశకు గురయ్యారు. దీంతో అధికారులు స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరపడంతో ఈసారి 3.50 లక్షల టన్నుల క్రషింగ్ చేసేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం అంగీకరించింది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఈసారి 26,500 ఎకరాల్లో రైతులు చెరుకు పంట సాగు చేశారు. 9 లక్షల టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
కొత్తూర్(బీ) సమీపంలోని ట్రైడెంట్ ఫ్యాక్టరీ మూతపడడంతో జహీరాబాద్ రైతులు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెరుకు తరలించి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు గోదావరి ఫ్యాక్టరీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది గోదావరి షుగర్ ఫ్యాక్టరీకి 3.50 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. మిగిలిన చెరుకు పంటను ఇతర ఫ్యాక్టరీలకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించగా, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల పరిధిలోని గోదావరి ఫ్యాక్టరీలో ఈనెల 13న , సంగారెడ్డి నియోజకవర్గంలోని గణపతి ప్యాక్టరీలో 14న క్రషింగ్ ప్రారంభించేందుకు యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. గాయత్రీ ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తే ట్రాన్స్పోర్టు, హార్వెస్టింగ్ కలిపి టన్నుకు రూ. 3,775, గోదావరి ఫ్యాక్టరీలో రూ.3,800, గణపతి ఫ్యాక్టరీలో రూ.3,827 మద్దతు ధర రైతులకు చెల్లించేందుకు నిర్ణయించినట్లు తెలిసింది.
కొత్తూర్ ట్రైడెంట్ ఫ్యాక్టరీ మూతపడడంతో జహీరాబాద్ ప్రాంత రైతులు 40 కిలోమీటర్ల దూరం వరకు రవాణా ఖర్చులు వారే భరించేలా, అంతకు మించి దూరమైతే రవాణా ఛార్జీల్లో ఫ్యాక్టరీ యాజమాన్యాలు భరించేలా అధికారులు మాట్లాడినట్లు తెలిసింది. కర్ణాటకలో చెరుకు మద్దతు ధర టన్నుకు ప్రభుత్వం రూ.3300 ప్రకటించింది. ఇప్పుడే ఫ్యాక్టరీలకు చెరుకు తరలించవద్దని, ఈనెల 11న జహీరాబాద్లోని ఓ ఫంక్షన్హాల్లో సమావేశమై కార్యాచరణ ప్రకటించేందుకు రైతులు నిర్ణయించినట్లు తెలిసింది. కర్ణాటక ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణ సర్కారు మద్దతు ధర ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావాలని, దీని కోసం రైతులందరూ ఏకతాటిపై ఉండాలని పలువురు రైతులు పేర్కొన్నారు.