పటాన్చెరు, డిసెంబర్ 11:అగ్రిమెంట్ ఒకరిది.. వ్యాపా రం మరొకది అన్నట్లుగా పటాన్చెరు మండల పరిషత్ వాణిజ్య సముదాయాల పరిస్థితి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం నడిబొడ్డున జాతీయ రహదారిపై మం డల పరిషత్ ఆదాయాన్ని పెంచేందుకు రెండు వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేశారు. లీజుకు తీసుకున్న వారు దుకాణాలు ఏర్పాటు చేసుకోకుండా ప్రభుత్వానికి కడుతున్న రెంటు కంటే రెట్టింపు ధరకు సబ్‌లీజుకిచ్చి అధికంగా ఆదాయం పొందుతున్నారు. ఎక్కువశాతం మంది నాయకులు, పట్టణ ప్రముఖులు ఈ దుకాణాలు దక్కించుకోవడంతో మండల పరిషత్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
మూడేండ్లకు ఒకసారి లీజును పునరుద్ధరించడం లేదా అక్రమాలుంటే రద్దు చేయవచ్చు. కానీ, అధికారులు అలా వ్యవహరించకపోవడంతో ఆదాయం భారీగా తగ్గింది. బస్టాండ్ ఎదురుగా 18 దుకాణాలు, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 54 దుకాణాలను నిర్మించారు. మొత్తం 72 దుకాణాలు. 2006లో ఈ వాణిజ్య సముదాయాలు ప్రారంభం అయినా, షాపుల కేటాయింపులో వివక్ష జరిగిందని ఎస్సీ, బీసీ, ఎస్టీ కులాల నాయకులు కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఈ షాపులను లీజుపై అద్దెకు ఇచ్చారు. అద్దెకు ఇచ్చినప్పుడు పెట్టిన అద్దెలకు మార్కెట్లో ఉన్న వాటికి తేడా ఉండడంతో మండల పరిషత్‌కు కోట్ల రూపాయల నష్టం సంభవించింది.
రెట్టింపు ధరకు సబ్లీజుకు..
పటాన్చెరు బస్టాండ్‌కు ఎదురుగా ఏర్పాటు చేసిన 18 షెటర్లు, ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా నిర్మించిన 54 దుకాణాలను తక్కువ ధరకు దక్కించుకున్న వారు వాటిని రెట్టింపు ధరకు సబ్లీజుకు ఇచ్చి లాభాలు గడిస్తున్నారు. ఈ రెండు షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో దుకాణాలకు రూ.5వేల నుంచి 13వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఒక్కో దుకాణదారుడు రూ.2లక్షల నుంచి 4 లక్షల వరకు అడ్వాన్స్‌లు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అడ్వాన్స్లలో రాయితీ ఇచ్చారు. ఇప్పుడు రూ.7.40లక్షల వరకు నెలకు అద్దె వసూలు అవుతున్నది. వేలంలో షాపులను దక్కించుకున్న ఎక్కువమంది షాపులు పెట్టకుండా ఇతరులకు లీజుకు ఇస్తూ రూ.20వేల నుంచి రూ.35వేల వరకు అద్దె పొందుతున్నారు. 2019 నుం చి ఈ షాపుల్లో దుకాణాలను వ్యాపారులు నడుపుతున్నారు.
2021నుంచి పూర్తిస్థాయిలో ఈ దుకాణ సముదాయాల్లో అద్దెలు వసూలు అవుతున్నాయి. ప్రతి ఏడాది పదిశాతం అద్దెను పెంచుతారు. మూడేండ్లకు లీజును రద్దు చేసి మళ్లీ వేలం వేసి వేరే వారికి ఇవ్వాలి. మూడేండ్లు దాటుతున్నా సబ్ లీజుకు ఇచ్చినవారిని అధికారులు గుర్తించడం లేదు. సబ్లీజుకు ఇచ్చి ఎక్కువ అద్దెలు పొందుతున్న వారి లీజులు రద్దు చేస్తే మండల పరిషత్‌కు రెట్టింపు అద్దెలు, అడ్వాన్స్‌లు వస్తాయి. ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. అత్యవసరమైన సమయంలో అధికారులు ఎవరి లీజునైనా రద్దు చేసే అధికారం ఉంది. లీజుకు తీసుకున్న వ్యక్తులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మరొకరికి షాపును ఇస్తే మండల ప్రజాపరిషత్ కార్యాలయం స్వాధీనం చేసుకోవచ్చు.
ప్రముఖులే ఓనర్లు.?
పటాన్చెరు పట్టణంలో మండల పరిషత్ నిధులతో నిర్మించిన రెండు షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో అధికశాతం దుకాణాలు నాయకులు, పట్టణ ప్రముఖుల చేతుల్లోనే ఉన్నాయి. అందుకే సబ్ లీజుకు దుకాణాలు వేరే వ్యక్తులకు ఇచ్చినా అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారు. పటాన్చెరు మండల పరిషత్‌లో 19 గ్రామ పం చాయతీలున్నాయి. నిధుల లేమితో గ్రామాల్లో పనులు సరిగ్గా జరగటం లేదు. ఇవే అద్దెలు రెట్టింపుగా వస్తే ఆదాయం రెట్టింపు అయ్యేది. గ్రామాలకు నిధుల కొరత ఉండేది కాదు. ప్రతి ఏడాది రూ.90లక్షలు అద్దెల ద్వారా ఆదాయం వస్తున్నది. మూడేండ్లకు రూ. 2.70లక్షలు జమ అవుతున్నాయి. సబ్ లీజులను రద్దు చేస్తే ఈ ఆదాయాలు రెట్టింపు అవుతాయి. కోట్ల రూపాయల అడ్వాన్స్‌లు వస్తాయి. ఆ దిశగా మండల పరిషత్ అధికారులు ముందడుగు వేస్తే మంచిది.