చేగుంట,అక్టోబర్13: ఆరు నెలలుగా గణితం అధ్యాపకురాలు లేక చదువులో వెనుకబడి పోతున్నామని మెదక్ జిల్లా చేగుంటలోని గిరిజన స్పోర్ట్స్ గురుకుల పాఠశాల/ కళాశాల ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థినులు సోమవారం ఉదయం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ జూనియర్ కళాశాల రెండో సంవత్సరం చదువుతున్న తమకు ఆరు నెలలుగా గణితం బోధించడం లేదని, రోడ్డెక్కి రాస్తారోకో చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
జిల్లా స్థాయి అధికారులు స్పందించి చేగుంటలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలకు గణితం అధ్యాపకురాలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గణితం బోధించేలా చర్యలు తీసుకుంటామని విద్యార్థినులకు మహిళా ఉపాధ్యాయులు హామీ ఇవ్వడంతో నిరసన, ఆందోళన విరమించారు. ఈ విషయమై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుమతిని వివరణ కోరగా నాలుగు నెలల క్రితం ఇక్కడ గణితం అధ్యాపకురాలిగా పనిచేసి బదిలీపై భద్రాచలం గురుకుల పాఠశాలకు వెళ్లిందన్నారు. అప్పటి నుంచి గణితం అధ్యాపకురాలి పోస్టు ఖాళీగా ఉండడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, కొండమలయ్యపల్లి నుంచి బదిలీపై వచ్చి సోమవారం విధుల్లో చేరిందన్నారు.