చౌటకూర్, జూలై 25: పురుగులు పట్టిన అన్నం..నీళ్ల చారు పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవా రం చోటు చేసుకుంది. మూడు కిలోల కంది పప్పుతో 240 మంది విద్యార్థులకు వంటలు వండిపెడుతున్నారని, వసతి గృహంలో సరైన సౌకర్యాలు లేక లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాల లేమిపై గతేడాది ఆందోళనకు దిగినా ఇప్పటికీ పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వసతి గృహంలో 240 మంది విద్యార్థులు ఉంటే మూడు కిలోల కంది పప్పు వండిపెడుతూ పూర్తిగా నీళ్ల చారుతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఇదేమని ప్రశ్నిస్తే తమపై కక్షగడుతున్నారంటూ విచారం వ్యక్తం చేశారు. వసతి గృహం వార్డెన్ శోభ ఏ మాత్రం అందుబాటులో ఉండటం లేదని, ఈ వార్డెన్ తమకొద్దంటూ నినాదాలు చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి జిల్లా అధికారి అఖిలేష్రెడ్డి వసతి గృహన్ని సందర్శించారు.
ఆయనతో పాటు మండల ప్రత్యేకాధికారి వసంతకుమారి, ఎంపీడీవో శంకర్లు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వసతి గృహంలో కెపాసిటీ కంటే ఎక్కువగా విద్యార్థులు ఉన్నారని, దీంతో మౌలిక సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. పురుగులు పట్టిన బియ్యం సివిల్ సప్లయ్ అధికారులకు రిటన్ పంపి కొత్త బియ్యాన్ని తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరయ్యాయని, కాంట్రాక్టర్లు ముందుకు రాక పనులు చేపట్టడంలో ఆల స్యం జరుగుతున్నట్లు చెప్పారు.సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.