చేర్యాల, నవంబర్ 10: సాంఘిక సంక్షేమ గురుకులాలు, బీసీ,ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సర్కారు గురుకులాలను గాలికి వదిలివేయడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి బీఆర్ఎస్ సర్కారు పంపిణీ చేసిన యంత్రాలు పాడైపోతున్నాయి. బీఆర్ఎస్ సర్కారులో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వేలాదిగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పి కార్పొరేట్ స్థాయి విద్య, వసతులు, భోజనం కల్పించారు. ప్రస్తుతం కార్పొరేట్ స్థాయి గురుకులంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో కొన్ని మాసాలుగా అన్నం వండే బాయిల్డ్ స్టీమ్ యంత్రాలు పనిచేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.పట్టణంలోని గురుకుల పాఠశాల, కళాశాలలో 600 మంది విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు వసతులు ఉన్నాయి. ఈ సంవత్సరం కళాశాల, పాఠశాలలో మొత్తం 450 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు.
విద్యార్థులకు రోజువారీగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి సమయంలో భోజనం అందించాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా భోజనం ఎక్కువ తయారు చేయాల్సి ఉండగా నిర్వాహుకులు బాయిల్డ్ స్టీమ్ యంత్రాల్లో అన్నం సకాలంలో వండి విద్యార్థులకు అందజేస్తారు. మిగతా అల్పాహారం, స్నాక్స్, కోడిగుడ్లు తదితర వాటిని గ్యాస్ పొయ్యిలపై తయారు చేసి విద్యార్థులకు అందజేస్తారు. బాయిల్డ్ స్టీమ్ యంత్రం మరమ్మతులకు రావడంతో కట్టెల పొయ్యి పైనే అన్నం, కూరలు వండాల్సి రావడంతో కొన్ని సమయాల్లో విద్యార్థులకు సకాలంలో భోజనం అందించ లేకపోతున్నట్లు తెలిసింది. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి బాయిల్డ్ స్టీమ్ యంత్రాన్ని వెంటనే మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.