మద్దూరు(ధూళిమిట్ట), జూన్19: తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్ నిర్ణయమవుతుందని, విద్యార్థుల తలరాతను మార్చేది తరగతి గది మాత్రమేనని తరగతి గది గొప్పతనాన్ని పెద్దలు గొప్పగా చెప్పేవాళ్లు. అయితే ఆ పాఠశాల విద్యార్థులకు ఆతరగతి గదులు శాపంగా మారాయి. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ ప్రాథమిక పాఠశాలలో సుమారు 80మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ముగ్గురు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు.
పాఠశాలలోని తరగతి గదులు శిథిలావస్థకు చేరుకొని పైకప్పు పెచ్చులూడుతున్నది. దీంతో అరకొరగా అందుబాటులో ఉన్న తరగతి గదుల్లోనే విద్యనభ్యసించాల్సిన దుస్థితి నెలకొన్నది. విద్యార్థుల కోసం నాలుగు తరగతి గదులు ఉండగా అందులో రెండు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం రెండు గదులు మాత్రమే అందుబాటులో ఉండడంతో ఒక్కో తరగతి గదిలో రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో ఎడమ వైపు నాలుగో తరగతి విద్యార్థులు, కుడి వైపు ఐదోతరగతి విద్యార్థులు పాఠాలు వింటున్నారు.
1, 2,3 తరగతి విద్యార్థులకు పాఠశాలగది, పాఠశాల వరండాలో ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఒక తరగతి గదిలోనే రెండు తరగతుల నిర్వహణతో విద్యార్థులు సరిగ్గా పాఠాలు వినలేని పరిస్థితి నెలకొంది. తరగతి గదులు లేక విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు. తరగతి గదులు నిర్మించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.