కొండాపూర్, డిసెంబర్ 5: తెలంగాణలో గురుకులాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రోజూ ఏదో ఒక గురుకుల పాఠశాల, కళాశాలల్లో సమస్యలపై విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అధికారులు వచ్చి పాఠశాలను సం దర్శించి వెళ్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. విద్యార్థులు ఉం డే గదుల్లో కరెంట్ బోర్డులు, కిటికీలు కూడా సరిగ్గా లేవు. మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి.
ఆరు బయట విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నా వారి పక్కనే కుక్కలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం వడ్డించే వారు. గురుకులాల పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేవి. కానీ, ప్రస్తుతం అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల విద్యార్థులకు పురుగుల అన్నం, నీళ్లచారు వడ్డించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఉండే ప్రాంతంలో చెత్తాచెదారం, నీటి సమస్యలు నెలకొన్నాయి. వంట గదుల్లో వాడే పరికరాలు, బాతురూమ్లు కూడా దుర్వాసనతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం, జిల్లా స్థాయి అధికారులు స్పందించి పరిష్కరించాలని బీఆర్ఎస్వీ నాయకులు కోరుతున్నారు.