సిద్దిపేట, ఆగస్టు 10:సిద్దిపేట పట్టణ శివారు ఎల్లంకి కాలేజీ ఆవరణలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలలో 339 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేక నిర్వహణ గాడితప్పింది. అద్దె భవనంలో పాఠశాల కొనసాగుతున్నది. ప్రహరీ లేక విద్యార్థులు రక్షణ లేకుండా పోయింది.
కుక్కలు, పందులు సంచరిస్తున్నా యి. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలను ఇప్పటి వరకు ఇవ్వలేదు. తరగతి గదుల తలపులు ఊడిపోయి ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. సీసీ కెమెరా లు చాలా వరకు పనిచేయడం లేదు. పాఠశాలలో వారం రోజుల్లో 10 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురై ఇంటికి వెళ్లారు.
మెనార్టీ గురుకుల పాఠశాలలో మెనూ సరిగ్గా అమలు కావడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నా రు. శనివారం రైస్ పొంగలి, చట్నీతో విద్యార్థులకు అల్పాహారం అందించాల్సి ఉండగా, కిచిడి, పచ్చి పులుసు పెట్టారు. ఉదయం పచ్చి పులుసు తినడంతో విద్యార్థులకు ఎసిడిటీ బారినపడే అవకాశం ఉంది. మధ్యాహ్య భోజనం శనివారం వెజిటేబుల్ కర్రీ, రైస్, పప్పు ఆకుకూర, రసం, పెరుగుతో వడ్డించాలి. కానీ, అన్నం, బీరకాయ కూర, పప్పుచారు, పెరుగుతో వడ్డించారు. 5 నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వంట నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రిఫ్రిజిరేటర్ పాడైపోయింది. దానిని బాగు చేయించక పోవడంతో మూలనపడింది.
వాష్‌రూమ్‌లు, మరుగుదొడ్లలో విద్యార్థులకు వాడేందుకు ప్రభుత్వం బకెట్లను అందజేయగా, వాటిన మూలన పడేశారు. ఐదుగురు వంట కార్మికులకు నలుగురు మాత్రమే ఉన్నారు. రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడంతో పాటు ఇన్చార్జి ప్రిన్సిపాల్ బదిలీపై వెళ్లడంతో ఆ సీటు ఖాళీగా ఉంది. దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక విద్యార్థులు సతమతమవుతున్నారు.ఇటీవల బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడికి ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ బాధ్యతలు ఇచ్చారు. అతను పూర్తిగా బాధ్యతలు చేపట్టలేదు. పూర్తిస్థాయి ప్రిన్సిపాల్‌ను నియమించడంతో పాటు తమ సమస్యలన్నీ పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.