దుబ్బాక, మార్చి 15: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో తోటి విద్యార్థులు గమనించడంతో విద్యార్థి ప్రాణాలు దక్కాయి. ఆ విద్యార్థిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానకు తరలించారు. వివరాలు.. దౌల్తాబాద్ మండలం గువ్వలేగికి చెందిన స్వప్నా, స్వామి దంపతులకు ఇద్దరు సంతానం. వీరు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లి, అక్కడ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు.
పెద్ద కొడుకు అఖిల్‌ను హబ్షీపూర్ జ్యోతి బాపూలే గురుకులంలో చేర్పించారు. చిన్న కొడుకును హైదరాబాద్‌లో తమవద్దనే ఉంచుకుని చదివిస్తున్నారు. అఖిల్ గతేడాది సిద్దిపేట మండలం నారాయణరావుపేట మహాత్మాజ్యోతి బాపూలే గురుకులంలో 6వ తరగతి చదువుకుని, ఈఏడాది హబ్షీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో చేరాడు. గురుకులంలో వసతులు సరిగ్గా లేకపోవడంతో పాటు ఇక్కడి వాతావరణం నచ్చలేదంటూ తల్లిదండ్రులకు అఖిల్ పలుమార్లు చెప్పాడు. కొద్ది రోజులుగా అఖిల్ మనోవేదనతో బాధపడుతున్నాడు. శనివారం వేకువజామున విద్యార్థులతో కలిసి క్రీడా మైదానానికి వచ్చాడు.
తనకు అనారోగ్యంగా ఉందని వ్యాయామ ఉపాధ్యాయుడితో చెప్పి గదిలోకి వెళ్లకుండా బాత్రూమ్కు వెళ్లి డోరుకు తాడుతో ఉరివేసుకున్నాడు. అటుగా వెళ్లిన విద్యార్థులు గమనించి, పరిస్థితిని వ్యాయామ ఉపాధ్యాయుడికి సమాచారం ఇచ్చారు. పాఠశాల సిబ్బంది వెంటనే వెళ్లి అఖిల్‌ను రక్షించారు. కొన ఊపిరితో ఉన్న అఖిల్‌ను రక్షించి, సీపీఆర్ చేశారు. ఆనంతరం 108 అంబులెన్స్‌లో సిద్దిపేట జిల్లా దవాఖానకు తరలించారు. అఖిల్‌కు మూర్చ సంబంధిత సమస్య ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ దవాఖానకు తరలించారు. అఖిల్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డి తెలిపారు.
హబ్షీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో 7వ తరగతి విద్యార్థి అఖిల్ ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గురుకలు పాఠశాలను సందర్శించారు. సంఘటనపై ఆయన పాఠశాల ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డి, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. విద్యార్థికి అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై గురుకుల పాఠశాల జాయింట్ సెక్రటరీ తిరుపతిరెడ్డితో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని నిలోఫర్ దవాఖాన సూపరింటెండెంట్‌కు ఫోన్ ద్వారా ఆయన కోరారు.