పటాన్చెరు రూరల్, ఏప్రిల్ 15: కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి..సంక్షేమ పాలన మళ్లీ రావాలని ప్రజలంతా కోరుతున్నారని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి వెన్నవరం ఆదర్శ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం ముత్తంగిలోని బీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు పట్టణ, గ్రామాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆదర్శ్‌రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, శ్రీకాంత్‌గౌడ్, కొలన్బాల్రెడ్డి, గడీల కుమార్‌గౌడ్ బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్‌రెడ్డి మాట్లాడుతూ.. పటాన్చెరులో బీఆర్ఎస్ పటిష్టంగా ఉందన్నారు. తొమ్మిది నెలల క్రితం ఎమ్మెల్యే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరినప్పుడు పార్టీలో కొంత అయోమయ పరిస్థితి ఉండేదన్నారు.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, పటాన్చెరులో బీఆర్ఎస్కు బలమైన శక్తిగా మార్చిన నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడలేదన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పటాన్చెరు నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధను పెట్టి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇస్తామన్నారు. ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి భారీగా తరలివెళ్దామని పిలుపునిచ్చారు.
పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రసంగం వినడానికి ప్రజలు ఆసక్తితో ఉన్నారని, సభను విజయవంతం చేసేందుకు అందరం గట్టిగా శ్రమిద్ధామన్నారు. మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ.. వరంగల్ సభతో బీఆర్ఎస్ విజయోత్సవ యాత్రలకు సిద్ధం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ నిమజ్జన యాత్రకు సిద్ధం కావాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.
సమావేశంలో సీనియర్ నాయకులు కొలన్బాల్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, శ్రీధర్‌చారి, మాజీ సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, మోటే కృష్ణయాదవ్, మాణిక్‌రెడ్డి, మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చందు ముదిరాజ్, మెరాజ్‌ఖాన్, కిట్టుముదిరాజ్, శ్రీనివాస్‌రెడ్డి, మాణిక్‌యాదవ్, తొంట అంజయ్య, సందీప్, విష్ణువర్ధన్ రెడ్డి, సిల్వరి శ్రీనివాస్, రామకృష్ట ముదిరాజ్, చందు, జయశ్రీ, శ్రీవేద శ్రీనివాస్, బండరాజు, శంకర్, అజ్మేరా, పద్మమ్మ, మధుసూదన్ రెడ్డి, రవి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.