జిన్నారం, జూలై 31: ఇన్నాండ్లు గ్రామ పంచాయతీగా కొనసాగిన జిన్నారం మున్సిపాలిటీగా ఏర్పాటైంది. దీంతో ఈ గ్రామంలో జీపీ పాలన ముగిసింది. పలు పల్లెలను కలుపుతూ, ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలను తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జిన్నారం గ్రామాన్ని మున్సిపాలిటీగా మా ర్చింది. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జిన్నారం మండలంలోని బొల్లారం పన్నెండేళ్ల క్రితం మున్సిపాలిటీగా ఏర్పాటైంది.
ఇటీవల గడ్డపోతారంలోనూ ఆయా గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా జిన్నారం మండలంలోని ఊట్ల, జిన్నారం, మంగంపేట, జంగంపేట, సోలక్పల్లి, రాళ్లకత్వ, అండూర్, శివాజీనగర్, కొడకంచి, నల్తూర్ గ్రామాలను కలుపుతూ జిన్నారం కేంద్రంగా కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. జిన్నారం గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అవతరించింది. దీంతో పంచాయతీ రాజ్ పాలన ముగిసింది.
జిన్నారం మున్సిపల్ పరిధిలో పది గ్రామాలతో కలిపి 17,956 జనాభా ఉంది. 12,710 ఓటర్లు ఉన్నారు. మున్సిపల్‌కు ఏటా సుమారు రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తున్నది. పచ్చటి పల్లెలను కలిపి మున్సిపల్‌గా జిన్నారం గ్రామాన్ని ఏర్పాటు చేయడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
ప్రజాభీప్రాయం సేకరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా మున్సిపల్‌గా ఏర్పాటు చేయడంపై ప్రజలు తప్పుబడుతున్నారు. మున్సిపాలిటీగా ఏర్పాటైతే పన్నుల భారం పెరుగుతుందని, అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిన్నారం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయవద్దని ఇటీవల ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు సైతం చేపట్టారు.
ఆందోళనలు చేపట్టినా స్పందన లేదు
జిన్నారం మున్సిపాలిటీగా వద్దని ఎన్నో ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. పల్లెలను కలిపి మున్సిపల్‌గా ఏర్పాటు చేయడంతో మాపై పన్నుల భారం పడుతుంది.
– రామకృష్ణ, రాళ్లకత్వ వాసి