సిద్దిపేట, జనవరి 10 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసుడు దేవుడెరుగు ఉన్న వాటిని చెడగొట్టడానికే సర్కార్‌కు ఉన్నదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తెర మీదికి వచ్చింది. ఇటీవల శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాల మార్పులు చేర్పులు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు కొన్నింటిని రద్దు చేస్తారన్న ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. వీటిలో సిద్దిపేట జిల్లాను ముక్కలుగా చేసి పరిధి తగ్గించేలా చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో, చేర్యాల ప్రాంతాన్ని పూర్వ వరంగల్ జిల్లాలో కలుపుతారనే చర్చ జోరందుకుంది. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాను సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి మూడు జిల్లాలుగా విభజించి పరిపాలనను ప్రజల వద్దకు తీసుకొచ్చారు. దీంతో ప్రజలకు ఎంతో మేలు జరిగింది. దూరభారం తగ్గింది. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచి వేస్తానన్న రేవంత్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను ఒక్కొక్కటిగా చెరిపివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలను రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇటీవల వారి మాటల్లోనే ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఒకవేళ ఇప్పుడు ఉన్న జిల్లాలను రద్దు చేస్తే అగ్గి రాజుకుంటుందని ప్రజలు ప్రభుత్వానికి ముందే హెచ్చరిస్తున్నారు. మరో ఉద్యమానికి ఇక్కడి ప్రజలు సిద్ధమవుతున్నారు.
సిద్దిపేట జిల్లాను ముక్కలు చేసే కుట్ర
సిద్దిపేట జిల్లాను ముక్కలు చేసే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలపై మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా 11 అక్టోబర్ 2016న కేసీఆర్ చేతుల మీదుగా 23 మండలాలతో పురుడుపోసుకుంది.తదుపరి ప్రజల డిమాండ్‌తో కొత్తగా మరో మూడు మండలాలు ఏర్పాటయ్యాయి. దీంతో 26 మండలాలకు చేరింది. ప్రస్తుతం కాంగ్రెస్ కుట్రలతో జిల్లాను ముక్కలు చేయడానికి భారీగానే కుట్రలు చేస్తున్నారు. ప్రజలకు ఇష్టం లేక పోయినా జిల్లాను కుదించడానికి కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలో కలిపే విధంగా కసరత్తు ప్రారంభించారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సభ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోనే నిర్వహించారు.
ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. ఇక్కడి వారికి ఎవరికీ ఆహ్వానం లేదు. పైగా ఇది ఉమ్మడి కరీంనగర్ సభ అని చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాలను ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలుపాలని అక్కడి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమచారం. కేసీఆర్ ప్రతి 50 కి.మీటర్ల విస్తీర్ణంలో నూతన జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ముందుకు పాలన వచ్చింది. నూతన జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలు, పోలీస్ కమిషనరేట్ భవనాలు నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలు ఏర్పాటు చేసింది.చిన్న జిల్లాలను గణనీయంగా అభివృద్ధి చేసి చూపించారు. రిజర్వాయర్ల నిర్మాణం చేసుకున్నాం.మండల కేంద్రాలకు రహదారుల నిర్మాణాలు జరిగాయి. చిన్న జిల్లాలు ఒక జిల్లాతో మరో జిల్లా పోటీపడి అభివృద్ధి సాధించాయి.
ప్రజల వద్దకే పాలన..
ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. 2016 అక్టోబర్ 11న సిద్దిపేట జిల్లాను అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, హరీశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టింది. రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాలుగా రూపుదిద్దుకున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఆజిల్లా కేంద్రాలకు ఎటు చూసినా 40 నుంచి 50 కి.మీ దూరం లోపు విస్తరించి ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లిరావడంతో పాలన ప్రజల వద్దకే చేరింది. ఒకప్పుడు మారుమూల పల్లెకు, మండల కేంద్రానికి జిల్లా కేంద్రం నుంచి అధికార యంత్రాంగం వెళ్లేది కాదు. జిల్లాలు ఏర్పాటయ్యాక జిల్లా కేంద్రం నుంచి 45 నిమిషాల్లో మారుమూల పల్లెకు వెళ్లి వస్తున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.
జిల్లాల రద్దుతో కుంటుపడనున్న అభివృద్ధి
రేవంత్ సర్కార్ జిల్లాలను రద్దు చేస్తే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. జిల్లాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో నూతన సమీకృత కలెక్టరేట్లు నిర్మించి అన్ని వసతులతో పాలన కొనసాగుతోంది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవనాలు, పోలీస్ కమిషనరేట్ భవనాలు ఏం చేస్తారనే ప్రశ్న ప్రజల్లో చర్చ జరుగుతోంది. జిల్లాల రద్దు వల్ల ఇందులో పనిచేసే ఎంతోమంది ఉద్యోగాలు పోతాయి. జిల్లా స్థాయి అధికారుల పోస్టులు సైతం పోనున్నాయి. ఇన్ని రోజులుగా హెచ్వోడీలుగా పని చేసిన వారంతా మళ్లీ కింది స్థాయి ఉద్యోగులుగా పనిచేయాల్సి వస్తుం ది. కొత్త జిల్లా ఏర్పాటు వల్ల ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరికాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో నిరుద్యోగులకు ఉపాధి లభించింది. ఇప్పుడు జిల్లా రద్దు చేస్తే వీరంతా రోడ్డున పడాల్సి వస్తుంది. ఇలా ఎనో సమస్యలు మళ్లీ పుట్టుకొస్తాయి. నూతన మండలాలు, నూతన రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కావడంతో పట్టణాలు, మండల కేంద్రాలు అభివృద్ధి చెందాయి. వివిధ వర్గాల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అధికారుల పర్యవేక్షణ ఉండడంతో పాలన మెరుగైంది. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.