గజ్వేల్, సెప్టెంబర్ 16: సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. వానకాలం వచ్చిందంటే బురదమయంగా మారుతున్న రోడ్లపై కాలినడకన వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో మట్టి రోడ్లన్నీ సక్రమంగా లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లకు మూడేండ్ల క్రితం రూ.22.87కోట్ల నిధులు మంజూరు చేశారు. మంజూరైన నిధులతో మున్సిపాలిటీలో 18కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు పనులు చేపట్టాల్సి ఉండగా పూర్తి స్థాయిలో పనులు పూర్తవలేదు. దీంతో వానకాలంలో బురదమయంగా మారుతున్న రోడ్లతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతేడాది ఆగస్టులో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు సీసీ రోడ్ల నిర్మాణం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2కోట్లను ప్రతిపాదించి తీర్మానం చేశారు. 20వార్డుల్లో 20పనులు చేపట్టాలని నిర్ణయించి ఒక్కో పనికి రూ.10లక్షలు మంజూరు చేశారు. 20వార్డుల్లో ఒక్కో పనికి రూ.10లక్షల చొప్పున నిధులు కేటాయించారు. అయితే ఆ నిధులతో కేవలం కొన్ని వార్డుల్లోనే పనులు పూర్తవగా మిగతా వార్డుల్లో ఎక్కడి పనులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం కోసం మంజూరు చేసిన నిధులు పెండింగ్‌లోనే ఉండడంతో వానకాలం వస్తే రోడ్లన్నీ చిత్తడిగా దర్శనమిస్తున్నాయి. దాంతో కాలనీల్లో నడవలేని పరిస్థితులు ఉన్నాయంటూ ఆయా కాలనీల్లోని ప్రజలు వాపోతున్నారు. లక్ష్మీప్రసన్ననగర్, ప్రజ్ఞాపూర్‌లోని పలు కాలనీలు, ఎయిర్టెల్ టవర్ గల్లీలోని పలు కాలనీలు, విలీన గ్రామాల్లోని రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ముందుకు
మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2కోట్లు ఉన్నప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కేవలం కొన్ని వార్డుల్లోనే పనులు పూర్తవగా మిగతా వార్డుల్లో సంబంధిత కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడం లేదు. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతోనే పనులు ప్రారంభించలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో ఆయా వార్డులో బురదమయంగా ఉన్న అంతర్గత రోడ్లను సీసీలుగా మార్చితే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. అందుకు అధికారులు పనులు త్వరగా ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులో ఇప్పటి వరకు పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు రెండు విడతలుగా నోటీసులు అందజేశాం. మరోసారి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులకు రీ టెండర్ నిర్వహిస్తాం.
– బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, సిద్దిపేట జిల్లా