సీఎం కేసీఆర్ ప్రజలు అడగకుండానే సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ సంపద పెంచుతుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను దోచి గద్దల్లాంటి అదానీ, అంబానీలకు, బడా కార్పొరేట్లకు పంచిపెడుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కలెక్టర్ రాజర్షి షా, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, రామాయంపేట, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్‌తో కలిసి మంత్రి బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటలో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రామాయంపేటలో రూ.20 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన 304 డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులకు అందజేశామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.60 వేలు మంజూరు చేసి, రూ.40 వేలు అప్పు కింద కట్టించుకున్నదని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న మహారాష్ట్రలో తాగునీళ్లు నాలుగు రోజుకోసారి వస్తే, తెలంగాణలో రోజుకు రెండు సార్లు మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రామాయంపేట అభివృద్ధికి వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రామాయంపేట, ఏప్రిల్ 5: సీఎం కేసీఆర్ రూపాయి లంచం లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా ఒక్కొక్కరికి రూ.15 లక్షల విలువ చేసే డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇచ్చారని, ఇందుకోసం అవిరళ కృషిచేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని ప్రజలందరూ నిండు మనస్సుతో ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. మంత్రి బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ నాయకులు క్రేన్ సహాయంతో భారీ గజమాలను మంత్రి మెడలో వేసి అభిమానం చాటుకున్నారు. అనంతరం డప్పూదరువుల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా మంత్రి డబుల్ బెడ్ రూం ఇండ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన గృహాలను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసినే వేదిక లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రామాయంపేటలో రూ.20 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన 304 డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులకు పట్టాలు అందజేశామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం రూ.60 వేలు మంజూరు చేసి, రూ.40 వేలు అప్పు కింద కట్టించుకున్నదని గుర్తుచేశారు. డబుల్ బెడ్ రూం కాలనీలోనే రేషన్ షాపు, అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్‌ను కోరారు. సీఎం కేసీఆర్ ప్రజలు అడగకుండానే వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి పలు పథకాలను ప్రవేశపెడుతూ సంపద పెంచుతుంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదలను దోచి బడా గద్దలు అదానీ, అంబానీలకు, బడా కార్పొరేట్లకు మాఫీ రూపంలో దేశ సంపదను పంపిపెడుతున్నారని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న మహారాష్ట్రలో తాగునీళ్లు నాలుగు రోజుకోసారి వస్తాయన్నారు. తెలంగాణలో రోజుకు నాలుగు సార్లు తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రామాయంపేట అబివృద్ధికి వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ ఈ సందర్భంగా మంత్రికి పలు అభివృద్ధి పనుల విషయమై వినతిపత్రం సమర్పించారు. పేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, మరిన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇండ్ల నుంచి మెదక్ రోడ్డు వరకు రోడ్డు మంజూరు చేయాలని మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఇప్పుడు ఇండ్లు రాని వారు ఎవరూ బాధ పడవద్దని, దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని, త్వరలోనే మరో 200 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సొంత స్థలం ఉన్నవారికి నెల రోజుల్లోనే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేయనున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి ఎగ్గె మల్లేశం, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డీవో సాయిరాం, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, తహసీల్దార్ మన్నన్, ఎంపీడీవో ఉమాదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, సరాఫ్ సౌభాగ్య శ్యాం, దేవుని జయ, బొర్ర అనిల్, సుందర్‌సింగ్, మల్యాల కవిత కిషన్, మాజీ సర్పంచ్ పాతూరి ప్రభావతి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మాకు ఇల్లు లేక గత 25 ఏళ్లుగా కిరాయి ఇండ్లలో కాలం గడుపుతున్నా. తెలంగాణ రావడంతోనే అప్పటి నుంచి 21 ఏళ్లపాటు బీఆఎస్ పార్టీ వెంటే ఉండి ఎక్కడ సమావేశం జరిగినా వెళ్తున్నా. ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీకే తన ఓటుతోపాటు మా గల్లీలో ఉన్న ఓట్లను కూడా వేయిస్తున్నా. నా 25ఏళ్ల కల సీఎం కేసీఆర్ ఇళ్లు ఇచ్చి మాకు, మా కుటుంబానికి ఆసరాగా నిలిచారు. నా జీవిత కాలంలో కేసీఆర్ మాకు దేవుడులాంటివారు. – మద్దెల వాణి, రామాయంపేట
మాకు ఇల్లు లేక గత ఏండ్ల కాలంగా కిరాయి ఇళ్లలోనే ఉంటున్నాం. నేడు ఎమ్మెల్యే పద్మక్క, సీఎం కేసీఆర్ మాకు డబుల్ బెడ్రూం ఇచ్చి ఆదుకున్నరు. మా జీవిత కాలం తెలంగాణ ప్రభుత్వాన్ని పద్మక్కను ఎప్పుడు మార్చిపోను. బతికున్నతకాలం కేసీఆర్ సార్‌ను మాకు దేవుడిగా భావిస్తాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి ఓట్లు వేయించి కేసీఆర్‌నే గెలిపిస్తాం. – పిట్టల యాదమ్మ, రామాయంపేట
మా ఆయన కూలీ పనిచేస్తాడు. మాకు గత దశాబ్దాల కాలంగా ఇళ్లు లేక కిరాయి ఇళ్లలోనే కాలం గడుపుతున్నాం. కేసీఆర్ సారు, పద్మక్క మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి మమ్మల్ని సొంతింటివారిని చేశారు. వారిని మేము ఎప్పుడు మరువం. ఇంత మంచి ఇల్లును మేమెప్పుడు చూడలేదు. వారి దయవల్ల మాకు మంచి ఇల్లు వచ్చింది.
– షాహీర్బేగం, రామాయంపేట
మాకు ఇల్లు వస్తదో లేదో అని ఆందోళనకు గురయ్యాం. మా కలను సీఎం సార్ కేసీఆర్, ఎమ్మెల్యే పద్మక్కలు గుర్తించి మాకు ఇల్లు కేటాయించారు. అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఇల్లు వచ్చిందంటే మా కుటుంబంలోని అందరు ఎంతో సంతోషపడ్డారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇల్లు రావడంతో నా సొంతింటి కల నెరవేరింది.
– కెండర్ల జయమ్మ, రామాయంపేట
– మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
రామాయంపేట ప్రజలే నా బలం, నా బలగం అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవందర్రెడ్డి అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు పట్టాల పంపిణీ అనంతరం ఆమె వేదికపై మాట్లాడారు. గత 20 ఏళ్లుగా తనను ఈ స్థాయికి తెచ్చింది రామాయంపేట ప్రజలేనని, వాళ్లే తన జీవితానికి పునాది అని, తాను ఎప్పటికీ రామాయంపేట మండలవాసులను మరవనని, పేట అభివృద్ధికి తనవంతు కృషి ఎల్లకాలం చేస్తానని చెప్పారు. రామాయంపేట ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేరుస్తానన్నారు. పట్టుబట్టి రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధిస్తానని భరోసా ఇచ్చారు. రామాయంపేట మండల సమస్యలను ఈ సందర్భంగా ఆమె మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.