ములుగు, నవంబర్ 14 : ఉద్యాన పంటల సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని ఉద్యాన వర్సిటీ ఉపకులపతి దండా రాజిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక ఆరోగ్య కేంద్రం, నర్సరీ, వర్మికంపోస్టు యూనిట్‌ను ప్రారంభించి రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ… సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు వర్సిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది, అధ్యాపకుల ఆరోగ్య అవసరాల నిమిత్తం నూతనంగా ఆధునిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఉద్యాన పంటల ద్వారా రైతులకు మెరుగైన లాభాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, వర్సిటీ అధికారులు చీనా నాయక్, లక్ష్మీనారాయణ, సురేశ్‌కుమార్, రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.