సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 25: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులు, భూముల సమస్యలను జూలై 30లోగా పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ కేసులు, సమస్యలపై అధికారులు, కుల సంఘాల నాయకులతో నిర్వహించిన సమీక్షలోఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతి నెలా పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
జూలై 30లోగా ఎస్సీ, ఎస్టీ కేసుల్లో భూముల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 41 శాతం ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినందుకు జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఎస్పీ పారితోష్‌పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం రమేశ్ బాబు, రాంబాబు నాయక్,శంకర్, నీలాదేవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.