కంది, నవంబర్ 25: లగచర్ల ఘటనలో అమాయకులను జైలులో పెట్టారని, కేసులు ఎత్తివేసి బాధితులను వెంటనే విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది జైలులో లగచర్ల బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బక్కి వెంకటయ్య మీడియాతో మాట్లాడారు.
లగచర్ల ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డికి గ్రౌండ్ లెవల్ రిపోర్టు ఇస్తామని చెప్పారు. లగచర్ల, రొటిబండ తండాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం పర్యటించిందని, ఇప్పటికీ గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారన్నారు. కలెక్టర్‌పై దాడి ఘటన దురదృష్టకరమని, కానీ అమాయకులను జైలులో పెట్టడం బాధాకరమన్నారు. లగచర్ల ఘటనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించారని, అర్ధరాత్రి ఇండ్లల్లోకి చొరబడి దాడులు చేసి అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు.
బాధితులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి స్టేషన్ బెయిల్ ఇవ్వడం సరికాదని, ఇది ఎస్సీ, ఎస్సీ యాక్టుకు విరుద్ధమన్నారు. అట్రాసిటీ కేసులపై స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసి విన్నవించినట్లు తెలిపారు. కార్యక్రమమంలో దళిత సంఘాల నాయకులు జగన్, దుర్గాప్రసాద్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం సభ్యులు పాల్గొన్నారు.