కంది, జనవరి 26: శ్రీవైకుంఠపుర దివ్యక్షేత్ర బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగం గా ఐదో రోజు గురువారం వసంత పంచమి సందర్భంగా ఉదయం లక్ష్మీహయగ్రీవ హోమం (విద్యార్థుల విద్యాభివృద్ధికి), గరుడ వాహన సేవ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు సమక్షంలో ఈ హోమం చేశారు.
మహాలక్ష్మి, గోదా సమేత విరాట్ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. హోమం, గరుడ సేవ అనంతరం విద్యార్థులకు తేనే, పెన్నులు ప్రసాదంగా పంపిణీచేశారు. సాయంత్రం పుష్కరిణిలో తెప్పోత్సవం, బలిహరణం ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.