గజ్వేల్, ఆగస్టు 11: కాంగ్రెస్ పాలనలో కులవృత్తులు కునారిల్లుతున్నాయని, రేవంత్ పాలనంతా అవినీతి, అక్రమాలమయం అయ్యిందని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. గీతన్నల చైతన్య యాత్రలో భాగంగా గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ, గజ్వేల్‌కు విచ్చేసిన యాత్రకు గీత కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం ఆర్అండ్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. 12 రోజులుగా చేపడుతున్న యాత్రకు ప్రతి మండల కేంద్రంలో విశేష స్పందన లభిస్తున్నదన్నారు. కల్లు, గీత కార్మికులపై అధికారులు, అధికార పార్టీ నాయకుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. మామూళ్లు బంద్ చేయాలని, హామీలు అమలు చేయాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.
గీత కార్మిక వృతికి ఎంతో ఆధారణ ఉంటుందని, కానీ.. ప్రభు త్వం తమ వృత్తిపై చిన్నచూపు చూడడం భావ్యం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక 400మంది గీతకార్మికులు మృతి చెందారని, ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోవడంతో గీత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లాకు సర్ధార్ పాపన్న పేరు పేడాతమని చెప్పి ఇప్పటికి నెరవెర్చలేదన్నారు. గీత కార్మికులపై వేధింపులు ఆపేసి నీరా కేంద్రాలను ప్రారంభించాలన్నారు.
ప్రభుత్వం గొల్ల కుర్మలకు రూ. 3లక్షలు, దళితులకు రూ.12లక్షలకు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో మూతపడిన దుకాణాలను తెరిపించాలని, నీరా కేంద్రాలను తిరిగి ప్రారంభించాలన్నారు. ఎంతో మందిపై అక్రమ కేసులు నమోదు చేయించి జైలుకు పంపారని, తిరిగి తాము అధికారంలోకి రాగానే అధికారులు, కాంగ్రెస్ నాయకులు అంతు చూస్తామని హెచ్చరించారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి దుకాణాలను తెరిపించాలని, అసలు రాష్ట్రంలో మంత్రి ఉన్నారా అని ప్రశ్నించారు.గజ్వేల్‌లో సర్ధార్ పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులలర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకపోతుల వెంకటరమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు దేవీ రవీందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, గౌడ సంఘం నాయకులు కనకగౌడ్, స్వామిగౌడ్, చందుగౌడ్, సందీప్‌గౌడ్, వెంకటేశంగౌడ్, భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.