విద్యను అభ్యసిస్తూనే వివిధ రంగాల్లో రాణించాలన్నదే ఆ చిన్నారి విద్యార్థి గోల్. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతర సాధన చేస్తున్నాడు. తనకు అత్యంత ఇష్టమైన బ్యాల్ బ్యాడ్మింటన్ క్రీడను ఎంచుకొన్నాడు. ఆ క్రీడలో రాణిస్తూ క్రమంగా జాతీయ స్థాయికి చేరుకున్నాడు. తనదైన ఆటతీరుతో క్రీడా ప్రముఖుల ప్రశంసలందుకుంటున్నాడు. బాల్ బ్యాడ్మింటన్‌లో సిద్ధహస్తుడై గ్రామీణ స్థాయి నుంచి జాతీయ క్రీడాకారుడిగా ఎదుగుతున్న వేముల సిద్ధ్దార్థ గురించి ప్రత్యేక కథనం…
మిరుదొడ్డి, మార్చి 13: సిద్దిపేట జిల్లాలోని మండల కేంద్రమైన మిరుదొడ్డికి చెందిన వేముల సరోజన-బాల్‌రాజు దంపతుల మూడో కుమారుడు వేముల సిద్ధ్దార్థ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. క్రీడలపై మక్కువ ఎక్కువగా ఉండడంతో సిద్దార్థ 4వ తరగతి నుంచే బాల్ బ్యాడ్మింటన్ క్రీడాంశంలో సాధన ప్రారంభించాడు. క్రీడా మెళకువలను నేర్చుకొని మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు.
రాష్ట్ర స్థాయిలో…
విద్యను అశ్రద్ధ చేయకుండా విద్యను అభ్యసిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మిరుదొడ్డి మాజీ ఎంపీటీసీ-1 గొట్టం బైరయ్య ప్రోత్సాహంతో జిల్లాస్థాయిలో రాణించి ఎన్నో ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసా పత్రాలెన్నో అందుకొని శభాష్ అనిపించున్నాడు. ఉమ్మడి జిల్లా జట్టుకు సారథ్యం వహిస్తూ జిల్లాకు మంచి పేరు తెచ్చిపెడుతున్నాడు. 2018వ సంవత్సరంలో సబ్ జూనియర్ అండర్-14 విభాగం బీహెచ్ఈఎల్లో, 2019లో వరంగల్ జిల్లా కల్లూరులో, 2020లో ఖమ్మం జిల్లాలోని ఉప్పుగల్‌లో, 2021లో ఖమ్మం జిల్లాలోని భువనగల్లో తనదైన ప్రతిభ కనబర్చాడు. హైదరాబాద్‌లో 2022లో సబ్ జూనియర్ అండర్-15 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చాటాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2023లో సత్తా చాటి జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు.
జాతీయ స్థాయిలో..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2023 రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ విభాగంలో సిద్ధ్దార్థ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. తద్వారా జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యాడు. గత ఫిబ్రవరి 16 నుంచి 20వ తేదీ వరకు మంచిర్యాల జిల్లా రాంపూర్‌లో జరిగిన జాతీయ 41వ ఛాంపియన్ షిప్ జాతీయ సబ్ జూనియర్ అండర్-15 విభాగంలో తెలంగాణ రాష్ట్ర టీమ్‌కు సారథ్యం వహించాడు. తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మారుమూల ప్రాంతమైన మిరుదొడ్డి నుంచి బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో జాతీలో స్థాయిలో రాణిస్తున్న వేముల సిద్ధ్దార్థను పలువులు అభినంది స్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది
బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో జిల్లాస్థాయి నుంచి నేను జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. జాతీయ స్థాయిలో ఆడడం ఎంతో సంతోషంగా ఉంది.
మా అమ్మానాన్నల ఆశయాలకు అనుగుణంగా చదువుకుంటూనే క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి చేరాలన్నది నా ఆకాంక్ష.
– వేముల సిద్ధ్దార్థ, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, మిరుదొడ్డి
క్రీడాకారులను ఎప్పుడూ ప్రోత్సహిస్తాం..
ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు నుంచి బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో సబ్ జూనియర్ అండర్-14, 15, 17 విభాగాల్లో వేముల సిద్దార్థ రాణించడం జిల్లాకు గర్వకారణం. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తనదైన ఆటతీరు ప్రదర్శిస్తూ ముందుకు సాగడం చాలా సంతోషంగా ఉంది. వేముల సిద్దార్థ వంటి క్రీడాకారులను మరెందరినో పల్లెల్లో తయారు చేయడానికి ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సిద్ధంగా ఉంది.
– గొట్టం బైరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్,ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్