మెదక్, మే 13(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రె స్ సర్కారు విఫలమవుతున్నది. ఆత్మీయ భరోసా పథకం పైలట్ గ్రామాలకే పరిమితమైంది. అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తయినా పథకం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో అర్హులైన ఉపాధి కూలీలు ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వసలు నివారించడం, స్థానికంగా ఉపాధి కల్పిండచానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పథకంలో పనిచేస్తున్న భూమిలేని నిరుపేద కూలీలకు ప్రతి సంవత్సరం రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ అమలు కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ సిబ్బంది అర్హుల గుర్తింపు ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. ఉపాధి హామీ సిబ్బంది అర్హుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. సంవత్సరానికి రెండు విడతలుగా రూ.12 వేల ఆర్థిక సాయాన్ని మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో మెదక్ జిల్లాలో 856 మందికి ఆత్మీయ భరోసా అందించారు. రెండో విడత కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
ఆత్మీయ భరోసా పైలట్ గ్రామాలకేనా?
2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం ఉపాధి హామీ పథకంలో 20 పనిదినాలు పూర్తి చేసిన కుటుంబంలో యజమానిగా ఎవరున్నా, ఆ కుటుంబంలోని మహిళలనే లబ్ధిదారునిగా గుర్తించారు. ఆత్మీయ భరోసా పథకం అమలు కోసం రేషన్ కార్డును యూనిట్‌గా తీసుకొని అర్హులను ఎంపిక చేశారు. మెదక్ జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 1.62 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. 3.32 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు.
సర్వే అనంతరం ఉపాధి హామీ సిబ్బంది 11వేల మంది అర్హులుగా గుర్తించారు. జనవరి 26న మొదటి విడతకు సంబంధించిన రూ.6 వేల నగదును ప్రభు త్వం జమ చేస్తామని ప్రకటన చేసింది. కానీ, మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసింది. మెదక్ జిల్లాలో 20 మండలాల్లో పైలట్ గ్రామాల్లో మాత్రమే లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా నగదు జమచేసింది. మిగిలిన వారికి మార్చి 31 వరకు నగదు జమ చేస్తామని చెప్పినా నేటి వరకు డబ్బులు జమ కాలేదు. దీంతో ఉపాధి కూలీలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు.