మెదక్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంతోపాటు పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు చర్యలు చేపట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. గతంతో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని కొత్త పద్ధతులు, విధానాలను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి పెద్దపీట వేస్తున్నది. ఇందుకు ప్రత్యేకంగా సీ-విజిల్ అనే యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దీనిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు 2014లో ఎన్నికల సంఘం సీ విజిల్ యాప్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీన్ని ఆధునీకరించడంతో పాటు ఎఫ్ఎస్టీ (ఫ్లయింగ్ స్కాడ్)తో అనుసంధానం చేసింది. అక్రమానికి సంబంధించిన ఫొటోను యాప్లో అప్లోడ్ చేస్తే 100 నిమిషాల్లో అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేసి, ఫిర్యాదుదారులకు సమాచారమిస్తారు. ఫిర్యాదుకు సంబంధించిన సమాచారం జిల్లా ఎన్నికల అధికారితో పాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లయింగ్ స్వాడ్కు చేరుతుంది. ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదు కోసం సీ-విజిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫిర్యాదు దారుడి పేరు, చిరునామా పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. అనంతరం ఫిర్యాదుదారుడు ఫొటో లేదా గరిష్టంగా 2 నిమిషాల నిడివి గల వీడియోను యాప్లో అప్లోడ్ చేసి వివరాలు నమోదు చేయాలి. ఫిర్యాదుదారుడికి యాప్ నుంచి రెఫరెన్స్ నంబర్ వస్తుంది. ఈ ఐడీ ద్వారా మొబైల్లో ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చు. ఫిర్యాదుదారుడి వివరాలు అంత్యంత గోప్యంగా ఉంచుతారు. గతంలో రికార్డు చేసిన వీడియోలు, ఫొటోలు అప్లోడ్ చేసే అవకాశం ఉండదు.
ఓటర్లు తమ ఓటు ఏ కేంద్రంలో ఉందో తెలియకపోవడం, కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు చోట్ల ఉండడంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో మై ఓటరు హెల్ప్ లైన్ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ను ఫోన్లో సులభంగా డౌన్లోడ్ చేసుకుని ఓటరు కార్డు ఎపిక్ నంబర్ అందులో నమోదు చేస్తే ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే అవకాశం ఉందనే వివరాలు తెలుస్తాయి.
ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యే అధికారులు, సిబ్బంది ఈ దఫా పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. గతంలో పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల విధులకు హాజరయ్యే సమయంలో వేసేందుకు అవకాశం ఉండేది.
మహిళలు, దివ్యాంగుల ఓటు శాతం పెంపొందించే ఉద్దేశంతో గతంలో వీరికి ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యూత్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటిని యువ అధికారులే నిర్వహించనున్నారు. మొదటిసారి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు.
ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు పెట్టనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. తమ అభ్యర్థిని గుర్తించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఈవీఎంలో స్వల్ప మార్పులు చేసింది. గతంలో ఓటింగ్ యంత్రాలపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు మాత్రమే ఉండేవి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫొటోలు ఉండనున్నాయి. పోస్టల్ బ్యాలెట్ పైనా ముద్రించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.