నారాయణఖేడ్, జనవరి 2: రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండలంలోని హన్మంత్‌రావుపేట్, నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు మన్సూర్‌పూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాలను అమలుచేస్తున్నట్లు చెప్పారు. మిగతా గ్యారెంటీలను సైతం అమలుచేస్తామన్నారు.. 6వ తేదీ వరకు చేపట్టనున్న ప్రజాపాలన గ్రామసభల్లో ఆయా పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. అనంతరం మంత్రి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించి రసీదులు అందజేశారు. పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు.
ఖేడ్ దవాఖాన పరిశీలన
నారాయణఖేడ్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇక్కడి ఏరియా దవాఖానను చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం మంత్రి నారాయణఖేడ్ ఏరియా దవాఖానను సందర్శించి ఆయావార్డులను పరిశీలించడంతోపాటు స్థానిక వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి డయాలసిస్ రోగులు, ఇతర రోగులను కలిసి సదుపాయాలపై ఆరా తీశారు. దశలవారీగా పూర్తిస్థాయిలో వైద్యులను నియమిస్తామని, దవాఖానలో అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. స్థానిక మాతా, శిశు దవాఖానకు అనుసంధానంగా మరో 50 పడకల దవాఖానను అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి, మంత్రిని కోరారు.ఈ కార్యక్రమంలో జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్‌రావు, కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ రుబీనాబేగం నజీబ్, ఎంపీపీ చాందిబాయిచౌహాన్, మాజీ ఎంపీ సురేశ్‌శెట్కార్, డీపీవో సురేశ్ మోహన్, డీఎంహెచ్‌వో గాయత్రిదేవి, ఆర్డీవో వెంకటేశ్, కౌన్సిలర్ నర్సింహులు, సర్పంచ్‌లు దత్తు, సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ప్రజాపాలన
ప్రజాసమస్యల పరిష్కారంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజల వద్దకే అధికార యంత్రాంగం వెళ్తుందని వైద్యారోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మండలంలోని బసంత్‌పూర్‌లో ఆరు గ్యారెంటీల అమలులోభాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమఫలాలు అందిస్తామన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు మాట్లాడుతూ అర్హులందరికీ గ్యారెంటీ పథకాలను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న గ్రామసభలో దరఖాస్తులు చేసుకునేందుకు ఫారాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
తొలిసారిగా మండలానికి వచ్చిన మంత్రికి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు మంత్రికి శాలువాకప్పి సత్కారించారు. మండలంలోని కల్బేమల్-రాజోలా మీదుగా జహీరాబాద్ ఆర్డీసీ డిపో నుంచి బస్సు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్, డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, మాజీ ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి తమ్ము ప్రసాద్, ఆర్డీవో వెంకారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్, మండల ఎంపీపీ అంజమ్మ, వైస్ ఎంపీపీ గౌసోద్ధీన్, గ్రామ సర్పంచ్ శ్యామల, మండల నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రవీకుమార్, నర్సింహారెడ్డి, డీఎల్పీవో రాఘవరావు, మండల తహసీల్దార్ భానుకిరణ్, డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి, ఎంపీడీవో వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.