పటాన్చెరు, మే 11: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, సంగారెడ్డి తదితర నియోజకవర్గాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయడానికి ఏపీ బాట పట్టారు. ఈనెల 13న తెలంగాణతో పాటు ఏపీలోనూ ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అదే రోజున ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ ఓటేయడానికి ఆసక్తి చూపి మూడు నాలుగు రోజులుగా ఏపీకి వెళ్తున్నారు. వీరి కోసం పోటాపోటీగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాయి ఏపీలోని రాజకీయ పార్టీలు. అంతేకాకుండా బీరు, బిర్యానీతో జేబు ఖర్చుకు నగదు ఆఫర్ చేస్తున్నట్లు తెలిసింది. ఈసారి ఏపీ అసెంబ్ల్లీకి హోరాహోరీ పోరు జరుగుతున్నది. ప్రతి ఓటు కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల స్థిరపడ్డ, నివసిస్తున్న ఏపీ వాసులను ఓటు వేసేందుకు రావాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. వారికోసం టూరిస్ట్ బస్సులు, ట్రావెల్ బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో పాటు ట్రైన్ టికెట్లు సైతం బుక్ చేశారు. ట్రావెల్, టూరిస్ట్, ఆర్టీసీ బస్సుల్లో రాబోతున్న ఓటర్లకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఇస్తున్నారని సమాచారం. ఏ పార్టీకి చెందిన నాయకులు ఆ పార్టీ ఓటర్ల కోసం బస్సులను నేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక బీరు.. ఒక బిర్యానీ పొట్లం, ఖర్చులకు కొంత నగదు, చల్లటి నీళ్ల బాటిల్‌ను ఇచ్చి బస్సు సీట్లలో కూర్చోబెడుతున్నారు.
కుటుంబంతో పాటు వచ్చే వారికి కార్లను పంపుతున్నారు. ఇప్పుడు ఏపీలో ఓటుకు సగటున రూ. 5వేలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. రానుపోను ఖర్చులతో పాటు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు సైతం చేస్తుండటంతో చాలామంది ఓటర్లు ఈసారి ఏపీలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. పైగా శనివారం, ఆదివారం సెలవులు కావడంతో ఐటీతో పాటు ఇతర ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కార్పొరేట్ ఉద్యోగులకు సెలవులున్నాయి. శుక్రవారం రాత్రికే వేలాది మంది ఏపీకి బయలు దేరారు. పటాన్చెరు నియోజకవర్గంలో 4.13 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో దాదాపు 25శాతం వరకు ఏపీ వాళ్లు ఉన్నారు. వీరిలో అధికశాతం మందికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు ఉన్నాయి. ఇక్కడ స్థిరపడ్డ వారిలో చాలామందికి ఏపీ రాజకీయాలపై ఆసక్తి ఉంది.
ఈసారి అక్కడ హోరాహోరీగా పోరు జరుగుతుండడంతో రెండుచోట్ల ఓట్లున్న వారు ఏపీలో ఓటేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అమీన్‌పూర్‌లోనే మొత్తం 84వేలమంది ఓటర్లు ఉండగా, ఏపీ ఓటర్లు 10వేలమంది వారి రాష్ర్టానికి ప్రయాణం అయ్యారని సమాచారం. పటాన్చెరు, బొల్లారం, రామచంద్రాపురం, భారతీనగర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల ఓటర్లు ఏపీకి ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం, చిట్కుల్, గుమ్మడిదల, బొంతపల్లి, భానూర్, ఇంద్రేశం పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నవారిలో అధికశాతం మంది ఏపీలో తమ ఓటును అక్కడ వేసేందుకు వెళ్తున్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులతో పాటు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వేలాదిమంది శుక్రవారం నుంచి బయలుదేరారు.