మెదక్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) :మెదక్ జిల్లాలో 20 23-24 సంవత్సరంలో 4871 కేసులు నమోదయ్యాయని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు వార్షిక నివేదిక-2024ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… 2023లో 4187 కేసులు నమోదు కాగా, 2024లో 4871 కేసులు నమోదైనట్లు తెలిపారు. హత్యలు, లైంగికదాడులు కేసుల్లో హత్యలు 2023లో 26 కాగా, 2024లో 28 కేసులు నమోదైపట్లు చెప్పారు. ఆస్తి హత్యలు 2023లో 7 కాగా, 20 24లో 13 నమోదు కాగా, అపహరణ కేసులు 2023లో 31 కాగా, 2024లో 41 కేసులు నమోదయ్యాయి. దొంగతనాల కేసులు14, పగటి దొంగతనాలు 29, రాత్రి దొంగతనాలు 188, గొలుసు దొంగతనాలు 7, దొంగతనాలు 249, ఆలయాల దొంగతనాలు 26, ఆటోమొబైల్ దొంగతనాలు 179 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మహిళలపై 2023లో 331 కేసులు నమోదు కాగా, 2024లో 355 కేసులు నమోదైనట్లు తెలిపారు. షీటీమ్‌లు 2024లో 48 కేసులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, 27 కేసులు నమోదైనట్లు తెలిపారు. జనవరి 2024 నుంచి 31 నవంబర్ వరకు 71 భరోసా(పోక్సో) కేసులు నమో దు కాగా, 86 మందిని అరెస్ట్ చేశామని, రూ.22 లక్షల నష్టపరిహారం ఇప్పించినట్లు ఎస్పీ తెలిపారు. దొంగతనాల కేసుల్లో గతేడాది 35 శాతం రికవరీ చేస్తే, ఈసారి 36.42 శాతం రికవరీ చేశామని ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
మెదక్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులు గతేడాది కంటే పెరిగాయని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 2023లో 31 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా, 2024లో 48 కేసులు నమోదైనట్లు తెలిపారు. సైబర్ క్రైం కేసులు 2023లో 92 కేసులు నమోదు కాగా, 2024లో 147 కేసులు నమోదైనట్లు తెలిపారు. జిల్లా లో రోడ్డు ప్రమాదాలు 2023లో 562 ప్రమాదాలు జరగగా, 323 మంది మృతి చెందారని, 480 మంది క్షతగాత్రులు అయ్యారన్నారు. 2024లో 568 ప్రమాదాలు జరిగితే 302 మంది మృతి చెందారని, 459 మంది క్షతగాత్రులు అయినట్లు తెలిపారు. 2023లో వాహన తనిఖీల్లో 2,88,456 కేసులు నమోదు కాగా, 2024లో 2,72,060 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో గతేడాది 4740 కేసులు నమోదై 10 మందికి జైలు శిక్ష పడిందని, ఈసారి 6563 కేసులు నమోదు కాగా, 11 మందికి జైలు శిక్ష పడిందని ఎస్పీ వెల్లడించారు. మెదక్ జిల్లాలో గతేడాది పేకాట కేసు లు 39 నమోదు కాగా, రూ.19,18,270 నగదును సీజ్ చేశామన్నారు. ఈసారి 38 కేసుల్లో రూ.9,70,082 నగుదు సీజ్ చేశామని చెప్పారు. మిస్సింగ్ కేసులు గతేడాది 369 కేసులు నమోదు కాగా, ఈసారి 397 కేసులు నమోదైనట్లు తెలిపారు. గతేడాది 344 మందిని గుర్తించగా, ఈ సంవత్సరం 362 మందిని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.
2025లో సైబర్ క్రైమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త వ్యక్తులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవద్దని, ఓటీపీ చెప్పకూడదని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు మధ్య తరగతి కుటుంబాలనే టార్గెట్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. లోన్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారని, వాటికి ఆకర్షితులై యువకులు, ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.