మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 2: రెవెన్యూ శాఖలో కొంతమంది అధికారులు బరితెగించి, అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి బతికున్న వ్యక్తిని ఏకంగా చనిపోయినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, భూమిని ఇతరులకు బదలాయించారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్ గ్రామ పరిధిలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కూటిగల్‌కు చెందిన తుజాలపురం మొండయ్యకు భార్య పద్మ, కూతురు రమ్య, కుమారులు రాంకిరణ్, సాయికిరణ్ ఉన్నారు.
మొండయ్య కొన్నాళ్లుగా బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదే అదునుగా భావించిన గ్రామానికి చెందిన మొండయ్య పెద్దనాన్న కుమారుడు తుజాలపురం రాములు 14 ఆగస్టు 2024 రోజున మొండయ్య చనిపోయినట్లు అతని పేరు మీద ఉన్న ఎకరం ఐదున్నర గుంటల భూమిని తప్పుడు రికార్డులతో వారసత్వ విధానం(సక్సేషన్)లో పట్టా మార్పిడి చేసుకున్నారు. అప్పటి తహసీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు రికార్డులతో పట్టామార్పిడి చేశారు. ఈ విషయం ఇటీవల జరగిన భూభారతి గ్రామ సభల్లో బహిర్గతమైంది.
మొండయ్య కుమారుడు రాంకిరణ్ తమ భూమి వివరాలను 1బీలో చెక్ చేసుకోగా, తమకు వారసత్వంగా వచ్చిన 2-13 గుంటల భూమిలో నుంచి 196/ఎ/3 సర్వేనెంబర్‌లోని 0.25గుంటలు, 188/ఎ5 సర్వే నెంబర్లోని 0.20.50 గంటల భూమి మొత్తం 1-05.50 గుంటల భూమి రికార్డుల నుంచి మాయమైంది. దీంతో ఆందోళన చెందిన మొండయ్య ధూళిమిట్ట తహసీల్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించారు.
దీంతో సక్సేషన్లో తుజాలపురం రాములుకు పట్టా మారిందని, రాములు నుంచి అతని భార్య పోశవ్వకు 0.20గుంటల భూమి గిప్ట్ ద్వారా పట్టా మారినట్లు రికార్డుల్లో తేలింది. సక్సేషన్ ద్వారా పట్టా మార్పిడి చేసే సమయంలో సాధారణంగా మరణ ధ్రువీకరణ పత్రం, వారసుల ధ్రువీకరణ పత్రం పట్టా పత్రం, ఆధార్ కార్డు, అప్లికేషన్‌తో పాటు ప్రభుత్వ నింబంధనల ప్రకారం ఫీ అండ్ స్టాంప్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొండయ్య విషయంలో తహసీల్దార్ డెత్ సర్టిఫికెట్ అప్లోడెడ్ అని మాత్రం చూపించారు.
సక్సేషన్ సమయంలో 50 ఏండ్ల మొండయ్యకు వారసుడిగా 70 ఏండ్ల రాములును కుమారుడిగా రికార్డుల్లో చూపించడం విడ్డూరంగా ఉంది. తప్పుడు రికార్డులతో బతికున్న వ్యక్తి పేరు మీద భూమిని ఇతరులకు పట్టా మార్పిడి చేసిన తహసీల్దార్, పట్టా చేయించుకున్న వ్యక్తి, ఇందుకు సాక్షులుగా ఉన్న ఇరువురు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం మొండ య్య మద్దూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్సై షేక్ మహబూబ్‌ను వివరణ కోరగా.. మొండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.