వట్పల్లి, జూలై 10 : రోడ్డు విస్తరణ పనుల్లో తమకు అన్యాయం చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో గురువారం చిరువ్యాపారులు రోడ్డెక్కారు. ప్రజా పాలన అంటూనే పెద్దోడికి ఒకలాగ.. పేదోడికి మరోలాగా అధికారులు వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొంత మంది పెద్దల బిల్డింగులు వదిలేసి తమవి కూలుస్తున్నారని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చిరు వ్యాపారులు మాట్లాడుతూ.. వట్పల్లి చౌరస్తాలో కొన్ని దశాబ్దాలుగా తము చిన్న చిన్న వ్యాపారులు చేస్తూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. మూడు నెలల క్రితం రోడ్డును వెడల్పు చేసి డివైడర్లను నిర్మించడానికి 60 ఫీట్లు తీసుకుంటామని అధికారులు నోటీసులు జారీచేసినట్లు చెప్పారు. న్యాయం కోసం మంత్రి దామోదర రాజనర్సింహ వద్దకు వెళ్తే ఆయన బూతులు తిట్టి పంపించారని, 60 ఫీట్లకు తక్కువ తీసుకునేది లేదని మంత్రి తెల్చి చెప్పారని చిరువ్యాపారులు వాపోయారు. చేసేదిమీ లేక తాము తమ ఇండ్లు, దుకాణాలు ఖాళీ చేశామన్నారు.
ఇందులో కొంత మంది అధికార పార్టీ నాయకులకు చెందిన బిల్డింగ్లు సైతం ఉండడంతో ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు 50 ఫీట్లకు కుదించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తమకు మాత్రం ఉండటానికి ఇల్లు లేకుండా, బతకడానికి 10 ఫీట్ల స్థలం లేకుండా చేసి, అధికార పార్టీ చెందిన నాయకుల కోసం 10 ఫీట్లు పోకుండా రోడ్డు విస్తీర్ణం తగ్గించడం సరికాదన్నారు. రోడ్డు వెడల్పు చేస్తే 60 ఫీట్లు చేయండి, లేకుంటే 40 ఫీట్లు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న చిరువ్యాపారులను పోలీసులు బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.