మెదక్ మున్సిపాలిటీ, మార్చి 14: వేసవి కాలం దృష్యా శనివారం నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటి పూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు జిల్లాలో ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తరువాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు గల పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5 గంటల వరకు పాఠశాలలను నిర్వహిస్తారు. పది పరీక్షలు ముగిసిన తరువాత తిరిగి ఉదయం పూట ఆయా పాఠశాలలు నడుస్తాయి.