పటాన్చెరు రూరల్, అక్టోబర్ 24 : తెల్లాపూర్ మున్సిపల్ సేవలకో దండం.. పాత పంచాయతీ పాలనే ముద్దంటూ ఘనపూర్ గ్రామస్తులు సంతకాల సేకరణ చేపడుతున్నారు. శుక్రవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఘనపూర్ వార్డులో గ్రామస్తులు మున్సిపాలిటీ సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఘనపూర్‌ను కలిపారని, ఇప్పుడు మున్సిపాలిటీ సేవలు గ్రామానికి అందడం లేదని మండిపడ్డారు. తిరిగి తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా మార్చాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వార్డు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి మున్సిపల్ వద్దు.. పంచాయతీ ముద్దంటూ నినాదాలు చేశారు. గ్రామంలో తిరుగుతూ సంతకాలు సేకరించారు.
సేకరించిన సంతకాలను కలెక్టర్‌కు ఇస్తామని వారు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామం నుంచి రింగ్‌రోడ్డు వెళ్తున్నదని తెల్లాపూర్ మున్సిపాలిటీలో గతేడాది విలీనం చేశారన్నారు. ఈ తర్వాత గ్రామానికి ఎలాంటి సేవలు అందడం లేదన్నారు. తాగునీటిని అందజేసే ఆర్వో ప్లాంట్ మూతపడి 8 నెలలైనా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో 300 స్ట్రీట్ లైట్లు వెలిగేవని, ఇప్పుడు 30 మాత్రమే వెలుగుతున్నాయని చెప్పారు. పారిశుధ్యం అధ్వానంగా మారిందన్నారు.
కొత్త నల్లా కలెక్షన్ కోసం అధికారులు రూ. 40 వేలు అడుగుతున్నారని ఆరోపించారు. అధికారులు అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. రోడ్లు అధ్వానంగా తయారైనట్లు తెలిపారు. తెల్లాపూర్ ఆఫీసుకు వెళ్లినా అడిగే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిపన్నులు పెంచారన్నారు. పంచాయతీ నుంచి ఇప్పడు ఆదాయం బాగా పెరిగిందని, ఆ ఆదాయాన్ని ఇతర చోట్ల ఖర్చు చేస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. ఏ సమస్య వచ్చినా పది కిలోమీటర్ల దూరంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీకి వెళ్లాల్సి వస్తున్నదని.. కలెక్టర్, ఎమ్మెల్యేలు తమ గ్రామాన్ని తిరిగి పంచాయతీగా పునరుద్ధరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు నిరంజన్, లక్ష్మీనారాయణ, ఎరుకలి రమేశ్, నాగేశ్, మంగలి రాజు పాల్గొన్నారు.