రామచంద్రాపురం, జూలై 1: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన భారీ అగ్ని ప్రమాద్రంలో తీవ్రంగా గాయపడిన పలువురు కార్మికులకు పటాన్‌చెరులోని ధృవ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి పాశమైలారంలోని ప్రమాదం జరిగిన సిగాచీ పరిశ్రమను, పటాన్‌చెరులోని ధృవ దవాఖానను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు.
సీఎంతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సరిగ్గా మంగళవారం 12.45 గంటలకు సీఎం రేవంత్ దవాఖానకు వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. 12.55 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు.
సీఎం దవాఖానకు వస్తున్న కారణంగా స్థానికంగా ఉన్న దుకాణాలను పోలీసులు మూసివేయించారు. మొదట ఉదయం 10గంటలకు దవాఖాన వద్ద సీఎం వస్తున్నారని డీపీఆర్వో నుంచి షెడ్యూల్ రావడంతో దవాఖాన పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుకాణాలను మూసివేయండంతో వ్యాపారులు ఇబ్బంది పడ్డారు.
దవాఖానలోకి ఉదయం నుంచి ఎవరిని అనుమతించకపోవడంతో రోగుల కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురయ్యారు. మొదట ధృవ దవాఖానను సందర్శిస్తామని షెడ్యూల్లో పేర్కొన్నప్పటికీ, ఆ తర్వాత షెడ్యూల్లో మార్పు జరగడంతో మొదట సీఎం సిగాచీ పరిశ్రమను సందర్శించారు. సీఎం వెంట డీజీపీ జితేందర్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్, ఉన్నతాధికారులు, పోలీసులు ఉన్నారు.