
రైతుబీమాకు నెలాఖరు వరకు అవకాశం
అర్హులతో దరఖాస్తు చేయించాలి
అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి
బోగస్, తప్పుడు ఆధార్ కార్డులు సమర్పిస్తే చర్యలు
లాభదాయక పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలి
రైతు వేదికల్లో చైతన్య సమావేశాలు నిర్వహించాలి
పెండింగ్ రైతు వేదికలు, వైకుంఠధామాల పనులు పూర్తిచేయాలి
టెలీ కాన్ఫరెన్స్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
అసలే కరోనాతో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. ఉపాధి అవకాశాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటున్నది. నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రతి కుటుంబం బడ్జెట్ తలకిందులైంది. కాగా, కేంద్ర ప్రభుత్వం మాటిమాటికీ గ్యాస్ ధర పెంచుతుండడంతో వినియోగదారులపై భారం పడుతున్నది. రెండు నెలల క్రితమే గ్యాస్ ధర రూ. 20.50 పెరిగింది. తాజాగా మరో రూ.25 పెంచడంతో వినియోగదారులపై అదనపు భారం పడినట్లయ్యింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 914కు చేరింది. వెయ్యికి ధర చేరువవుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల సిలిండర్ ధర రూ. 1798కి చేరింది.
సిద్దిపేట, ఆగస్టు 22 : అర్హులందరికీ ఆసరా పింఛన్ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సిద్దిపేట నుంచి మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.. పింఛన్ రాని దివ్యాంగులు, వితంతు, ఒంటరి, బీడీ కార్మికులు, బోధకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, గీత, నేత కార్మికులను గుర్తించి వారితో దరఖాస్తు చేయించాలన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రైతుబీమాకు అర్హులై ఉండి నమోదు కాని వారి వివరాలు నెలాఖరులోగా నమోదయ్యేలా చూడాలన్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్‌కు అర్హత వయస్సును 57 ఏండ్లకు తగ్గించారని, అర్హులు ఈనెల 31 వరకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు మీసేవ కేంద్రాల్లో రూపాయి కూడా రుసుం తీసుకోవద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని మంత్రి తెలిపారు. పింఛన్ కోసం తప్పుడు ఆధార్ కార్డులు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆధార్ కార్డులో ఉద్దేశపూర్వకంగా వయస్సు ఎక్కువ ఉన్నట్లు సవరణ చేసిన బోగస్ కార్డులు సృష్టించిన బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.
రైతుబీమాతో ధీమా..
ప్రపంచంలోనే రైతులకు బీమాను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నాలుగేండ్లుగా రైతులకు బీమా కల్పిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లాలో 1,83,299 మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారన్నారు. ప్రభుత్వం వీరికి సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లిస్తుందని, రైతుబీమా నమోదుకు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకునేందుకు రైతులకు అవకాశం ఉందన్నారు. ఏఈవోలు తమ క్లస్టర్ పరిధిలోని రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులను సమన్వయం చేసుకుంటూ క్రయవిక్రయాలు, వారసత్వంగా తండ్రి నుంచి పిల్లలకు సంక్రమించిన భూమి వివరాలు తీసుకొని వారిని రైతుబీమాలో నమోదు చేయాలన్నారు. అనివార్య కారణాలతో రైతు చనిపోతే వారం రోజుల్లోగా బాధిత కుటుంబానికి ఇచ్చే బీమా పరిహారం కొండంత ధైర్యాన్ని ఇస్తుందన్నారు. 18 నుంచి 59 ఏండ్ల వయస్సున్న రైతులు రైతుబీమాలో నమోదు చేసుకోవాలన్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి..
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయి వినియోగంలోకి రాని వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులను ప్రారంభించాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుల్లో కంపోస్టు తయారు చేయాలని సూచించారు. వైకుంఠధామాలు, రైతువేదికల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి రైతువేదికలో వారానికి ఒక సారైన రైతుచైతన్య సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వీటి పురోగతిని పరిశీలించేందుకు తాను, జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో ఆకస్మిక పర్యటనలు చేస్తామని మంత్రి తెలిపారు. సాగునీటి సౌలభ్యం పెరగడంతో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, ప్రధానంగా దొడ్డురకం వరి సాగు చేయడంతో ఆ వడ్లను కేంద్రం కొనేందుకు ఆసక్తి చూపడం లేదని, ఫలితంగా గోదాంల్లో నిల్వలు పేరుకు పోతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ డిమాండ్ నేపథ్యంలో రైతులు పత్తి, కంది పంటలు సాగు చేయాలని సూచించారు. లాభదాయకమైన ఆయిల్‌పామ్, మల్బరీ సాగువైపు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా స్టాక్ పెట్టుకోవాలన్నారు. లాభదాయక పంటలను రైతులు సాగుచేసేలా ఇప్పటి నుంచే యాసంగి సాగు కార్యాచరణ ప్రణాళికలను వ్యవసాయాధికారులు సిద్ధం చేయాలని సూచించారు. మున్సిపాలిటీల్లో ఇండ్ల నిర్మాణ అనుమతుల్లో జాప్యం జరగకుండా అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీకి వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లు మంజూరు చేసిందని, నిర్మాణ స్థలం, డిజైన్లు ఫైనల్ చేసి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రఘునందన్‌రావు, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి పాల్గొన్నారు.