మద్దూరు (ధూళిమిట్ట) : సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో వర్షాల కోసం మహిళలు బతుకమ్మ ఆడారు. గత నెల రోజులుగా వరుణ దేవుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందిన గ్రామ మహిళలు బిందెలలో నీళ్లు తీసుకువచ్చి గ్రామంలోని ప్రధాన కూడలిలో బిందెలు పెట్టి బిందెల చుట్టూ బతుకమ్మ ఆడారు.
వర్షాల కోసం వరుణ దేవుని పాటల రూపంలో వేడుకుంటూ బతుకమ్మ ఆడారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, సాగు పనులు ముందుకు సాగడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు సాగు చేశామని, వర్షాలు రాకపోతే పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టం పోనున్నట్లు వాపోయారు. పంటలు ఎండిపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.