మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 11: లారీ పని కోసమని తన భర్తను తీసుకెళ్లి మాయం చేశారని ఆరోపిస్తూ ఓ మహిళా పిల్లలు, బంధువులతో కలసి లారీ ఓనర్ ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మర్మాములలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకా రం..మర్మాముల గ్రామానికి చెందిన లారీ ఓనర్ బత్తిని కనకయ్య మే 3న గ్రామంలోని యాటెల్లి శ్రీకాంత్‌ను లారీ డ్రైవర్ నూకల పూర్ణచందర్రెడ్డితోపాటు తమిళనాడు నాంకల్ జంక్షన్లో లారీ లోడ్ దించిరావాలని పంపించాడు. అయితే మే 7న గ్రామానికి పూర్ణచందర్‌రెడ్డి ఒక్కడే తిరిగివచ్చాడు. ఈనెల 8వ తేదీన యాటెల్లి శ్రీకాంత్ భార్య కవిత పూర్ణచందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి నీతో కలిసి వెళ్లిన భర్త ఎక్కడున్నాడని ప్రశ్నించింది. దీంతో నీ భర్త నా వద్ద రూ.200 తీసుకొని ఎక్కడికో వెళ్లాడని పూర్ణచందర్‌రెడ్డి చెప్పాడు. ఆందోళనకు గురైన కవిత తన బంధువులతో కలిసి తమిళనాడుకు వెళ్లి అక్కడ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు శ్రీకాంత్ మిస్సింగ్ అయినట్లు పోస్టర్లు అంటించారు. తమిళనాడు అంత వెదికినా భర్త ఆచూకీ దొరకకపోవడంతో ఆమె తిరిగి గ్రామానికి చేరుకొని మే 15న మద్దూరు పోలీస్‌లకు భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. అయితే ఇక్కడి పోలీసులు తొలుత ఫిర్యాదు తీసుకోకపోగా, మా పరిధిలోకి రాదని దాటవేశారని రెండ్రోజుల తర్వాత కేసు నమోదు చేశారని శ్రీకాంత్ భార్య కవిత వాపోయింది. అయినప్పటికి శ్రీకాంత్ జాడ తెలువకపోవడంతో మంగళవారం కవిత తన ఇద్దరు కొడుకులు, బంధువులతో కలిసి మర్మాములలో లారీ ఓనర్ బత్తిని కనకయ్య ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగింది. తన భర్త జాడ తెలిపే వరకు తన ఆందోళనను విరమించేది లేదని ఆమె భీష్మించి కూర్చుం ది. భర్త ఆచూకీ తెల్పకపోతే ఇక్కడ తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని కవిత హెచ్చరించింది. ఈ క్రమంలో లారీ ఓనర్ కనకయ్య శ్రీకాం త్ భార్య కవిత, బంధువుల మధ్య కొంత ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు నచ్చ చెప్పి వారిని చేర్యాల సీఐ శ్రీను వద్దకు తీసుకెళ్లారు.