గజ్వేల్ అర్బన్, డిసెంబర్ 29 : మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమయ్యాయని ఆటోడ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. తమకు నెలకు రూ.15వేల చొప్పున జీవనభృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గంలోని ఆటోవాలాలు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం అమలు చేసినప్పటి నుంచి మహిళలతో పాటు పురుషులు కూడా ఆటోలు ఎక్కడం లేదన్నారు. దీంతో తమ ఉపాధి దెబ్బతిన్నదన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమయ్యాయని, ప్రభు త్వం నెలకు రూ.15వేల చొప్పున జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ఆటోకార్మికులు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ఆటోకార్మికులు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఐవోసీ పక్కన మైదానం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు సుమారు వెయ్యి ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో తాము రోడ్డున పడ్డామన్నారు. ఆటోకార్మికుల కుటుంబాలకు భద్రత కల్పిస్తూ ఒక్కో ఆటోకార్మికుడికి నెలకు రూ.15వేల జీవనభృతి కల్పించాలన్నారు. బస్సు డ్రైవర్లుగా, హెల్పర్లుగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిన వారు ప్రస్తు తం ఆటోకార్మికులుగా జీవనం వెల్లదీస్తున్నారని, అలాంటి వారికి ఆర్టీసీల్లో తగిన ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆటోకార్మికుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు.