రాయపోల్, జనవరి 16 : నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు అన్నారెడ్డి గారి సుభాష్‌రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో కలిసి ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసినందుకు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను ఆపదలో ఉన్నా నాయకులు, ప్రజలు అశీర్వదించి గెలిపించారని, వారందరికీ ఎల్లప్పుడు రుణపడి ఉంటానన్నారు. పార్టీలకతీతంగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో లేకున్నా, ప్రజల పక్షాన ఉంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు మహ్మద్ షాదుల్లా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, ఎనగుర్తి మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, అంజల్ ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.