చేర్యాల, మే 15 : పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై వెళ్లేందుకు ప్రజలు, వాకర్లు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ సర్కారు పాలనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో పెద్ద చెరువుకు పూర్వ వైభవం వచ్చింది. చెరువును లోతుగా తవ్వి పూటికతీసి, చెరువుకట్టను బలోపేతం చేయడంతో పాటు వెడల్పు చేయడం, చెరువుకు ఇరువైపుల ఉన్న మురికి తుమ్మ చెట్లతో పాటు ఇతరాత్ర చెట్లను తొలగించారు.
ప్రతి ఏటా చెరువులోకి గోదావరి జలాలలు విడుదల చేయడంతో పట్టణ ప్రజలుకు నీటి తిప్పలు తప్పాయి. గత కొన్ని మాసాలుగా చెరువు కట్టకు ఇరువైపులా మురికితుమ్మ చెట్లు ఏపుగా పెరిగిపోవడంతో వాహనదారులతో పాటు వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. వాకింగ్ చేసే వారు కట్ట పై నడుస్తున్న సమయంలో ఏవైన వాహనాలు వస్తే వెంటనే వారు పక్కకు జరిగే సమయంలో తుమ్మ చెట్టు వారికి తగులుతున్నాయి. దీనికి తోడుగా కట్ట పై పగుళ్లు రావడం, కట్ట పై భాగంలో కంకర తెలిఉండడంతో వాకింగ్ చేస్తున్నవారు గాయాలపాలవుతున్నారు.
చెరువు కట్టకు ఇరువైపుల ఉన్న మురికి తుమ్మ తదితర చెట్లను తొలగించి, కట్ట పై భాగంలో మొరం పోస్తే వాకర్స్‌తో పాటు అటువైపుగా వెళ్లే రైతులు, వాహనదారులకు ఎంతో వసతి చేకూరుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ ఇరిగేషన్ అధికారులు స్పందించి కట్టకు ఇరువైపుల ఉన్న చెట్లను తొలగించాలని, కట్టకు మరమ్మతులు చేయాలని పెద్ద చెరువు కట్ట వాకర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.