రాయపోల్ ఫిబ్రవరి 27 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లిలో రెండు రోజులపాటు జరిగిన వీరభద్రస్వామి కల్యాణోత్సవాలు ముగిశాయి. గురువారం రాత్రి స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం భక్తులు అగ్నిగుండాలు తొక్కే కార్యక్రమం నిర్వహించారు. పలువురు భక్తులు అగ్నిగుండాలను తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ఆలయం నుంచి రథోత్సవం గ్రామంలోని ప్రధాన విధులో వీరభద్ర స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి ఊరేగింపు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
బ్యాండ్ మేళాలు. భక్తుల కోలాటాలు. మహిళల కోలాటాలు. యువకుల నృత్యాల మధ్య రథోత్సవని వైభవంగా నిర్వహించారు. ఇంటింటికి మంగళ హారతులు ఇచ్చి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. వడ్డేపల్లి పరిసర గ్రామాల నుంచి రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉత్సవాలను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా రాయపోల్ ఎస్సై మానస. ఏఎస్ఐ దేవయ్య పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.