చిన్నకోడూరు, మే 11 : రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో రైతులకు స్పింక్లర్ పరికరాలను ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి జడ్పీ చైర్ పర్సన్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మంత్రి హరీశ్‌రావు 70 శాతం సబ్సిడీతో జిల్లాలో 27 వందల స్పింక్లర్ పరికరాలను రైతులకు అందజేశారు. చిన్నకోడూరు మండలంలో కూరగాయలు సాగుపై అధిక రైతులు దృష్టి మళ్లించారని తెలిపారు. మిర్చి తోటను సాగు చేసి మండలంలోని చిన్నకోడూరు, మాచాపూర్, చంద్లాపూర్, విఠలాపూర్, గంగాపూర్ తదితర గ్రామాల్లో రైతులు అధిక లాభాలను అర్జిస్తున్నారు.
రైతులంతా వరికి బదులు కూరగాయల సాగు పామాయిల్, మల్బరీ తోటల సాగుపై దృష్టి సారించి ఎక్కువ లాభాలను అర్జించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా డైరెక్టర్ మేడికాయల వెంకటేషం, సొసైటీ చైర్మన్ కనకరాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఉద్యానవన మండల అధికారి భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ సంతోషి విక్రమ్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు గుండెల్లి వేణు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీకాంత్ యాదవ్, రామంచంద్రం, రాజలింగం, మధుసూధన్‌రెడ్డి, కుంటయ్య, రవీందర్‌రెడ్డి, రైతులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.