తొగుట: శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి, ఓటమిని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై (Kotha Prabhakar Reddy) కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి విమర్శించారు. వెంకట్రావుపేటలో పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులలో హోమ్‌గార్డు పట్టుబడ్డ నేపథ్యంలో అనుమానాలున్నాయని, విచారణ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా వ్యవస్థలో పొరపాటు జరిగితే ప్రశ్నించే హక్కు లేదా అని ఆయన నిలదీశారు.
పోలీస్ వ్యవస్థ మీద మాకు అపార నమ్మకం ఉందని, కేసీఆర్ హయాంలోనే పోలీస్ స్టేషన్లకు నూతన వాహనాలు, మెయింటనెన్సు ఆర్థిక సహాయం, పోలీస్ రిక్రూట్మెంట్, జీత భత్యాలు పెంచడం లాంటి కార్యక్రమాలతో పాటు ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమం ద్వారా వ్యవస్థలో విప్లవాత్మాక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. మద్యం సేవించి తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, బెల్ట్ షాప్‌లు నియంత్రించాలని ఎమ్మెల్యే కోరితే నాటి, నేటి బెల్ట్ షాప్‌ల లెక్కల గురుంచి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే బెల్ట్ షాప్‌లు తొలగిస్తామని హామీ ఇవ్వలేదా అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో డబ్బుల పంపిణీ గురుంచి మాట్లాడటం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు. ఎన్నికల్లో బోలెడు హామీలు ఇచ్చి అధికారంలోకి వొచ్చిన మీరు హామీలు నెరవేర్చడం గురుంచి మాట్లాడాలన్నారు. రుణమాఫీ పూర్తి కాలేదని, రైతు భరోసా అందలేదని, 6 గ్యారంటీలు అడ్రస్ లేవని, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం లేదని, పింఛన్ పెరగలేదని, కొత్త పెన్షన్ లేవని, యువకులకు ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు బండారు స్వామి గౌడ్, పాత్కుల బాలేష్, పిట్ల వెంకటేష్, ఎంగలి నరేందర్, సుతారి రాంబాబు, బెజ్జనమైన కృష్ణ తదితరులు ఉన్నారు.