సిద్దిపేట అర్బన్, జనవరి 4: రైతుబంధు పండుగ జాతర ఊరూరా కొనసాగుతున్నది. పంట పెట్టుబడి సాయం కింద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎనిమిదో విడతల్లో భాగంగా గత నెల 28వ తేదీ నుంచి రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను జమ చేస్తున్నది. ఇందులో భాగంగా ఆరో రోజు మంగళవారం రైతులకు రైతుబంధు డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసింది. యాసంగి పెట్టుబడి కోసం రైతులు ఈ డబ్బులు ఉపయోగించుకుంటున్నారు. దీంతో జిల్లాలోని అన్ని ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద రైతుల సందడి కనిపిస్తున్నది. ఆరో రోజు (మంగళవారం) సిద్దిపేట జిల్లాలో 7,034 మంది రైతులకు గానూ రూ.18,42,80,728, మెదక్ జిల్లాలో 3,422 మంది రైతులకు గానూ రూ.8,97,44,077, సంగారెడ్డి జిల్లాలో 8,451 మంది రైతులకుగానూ రూ.22,42,14,323ను మొత్తం ఉమ్మడి జిల్లాలో 18,907 మంది రైతులకు రూ.49,82,39,128ను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. కాగా, ఇప్పటి వరకు మొత్తం ఆరు రోజుల్లో సిద్దిపేట జిల్లాలో 2,82,348 మంది రైతులకుగానూ రూ.256,80,33,822, మెదక్ జిల్లాలో 2,27,963 మంది రైతులకుగానూ రూ.169,21,89,266, సంగారెడ్డి జిల్లాలో 3,00,767 మంది రైతులకుగానూ రూ. 281,17,49,814 జమ చేయగా, మొత్తం ఉమ్మడి జిల్లాలో మంగళవారం వరకు 8,11,078 మంది రైతులకుగానూ రూ.707,19,72,902 లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.
పెట్టుబడికి ఏ ఇబ్బంది లేదు..
మద్దూరు, జనవరి 4: మాది రేబర్తి. నా పేరు వంగపల్లి రాములు. నాకు పావుదక్కువ నాలుగు ఎకరాల భూముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వేస్తున్న రైతుబంధు పైసలు నా బ్యాంకుల పడ్తవి. అప్పట్ల పంట ఎయ్యాలంటే అప్పు కోసం తిరిగేది. ఇప్పుడైతే ఆ బాధ లేదు. ఏటేటా ముఖ్యమంత్రి సారు పెట్టుబడికి రైతుబంధు పైసలు ఇస్తుండు. ఆ పైసలను దున్నకాలకో, సీడ్ బస్తాలకో, మందులతో అవుసరమైతున్నవి. ఇబ్బంది లేకుండా పెట్టుబడి పెట్టి పంట పండిస్తున్నం. మస్తు సంతోషమైతాంది.
రైతుబంధుతో సంబురం
తెలంగాణ ప్రభుత్వం యాసంగి పంట పెట్టుబడిని రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయడంతో అన్నదాతలు సంబురాలు చేసుకుని మిఠాయిలను పంచిపెట్టుకున్నారు. మంగళవారం తూప్రాన్ మండల పరిధిలోని మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి వారు క్షీరాషేకం చేశారు. కార్యక్రమానికి తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, ఎంపీపీ గడ్డి స్వప్న, జడ్పీటీసీ రాణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు సతీశ్‌చారి, మల్కాపూర్ సర్పంచ్ మన్నె మహాదేవి, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులుగౌడ్, వెంకటేశ్, స్వామి, హైమద్, రాజేశ్వర్, రాజు, సత్యనారాయణగౌడ్ ఉన్నారు.
మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్లో రైతుబంధు సంబురాలు
మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో రైతుబంధు సంబురాల్లో భాగంగా మంగళవారం ఎడ్ల బండిపై, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన రైతులు, గ్రామంలో ఎడ్ల బండిపై ‘జై రైతు బంధు, జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేస్తూ ఊరేగించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొరగొల్ల రాములు, రైతులు నర్సింహులు, అంకయ్య, కిరణ్, ఎగ్గడి శేఖర్, రాములు, గంగమళ్లు, రవి, ఎల్లంతో పాటు పలువురు మహిళ రైతులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌ను దేవుడే పంపినట్టుంది..
మా కుటుంబానికి నాలుగు ఎకరాల వ్యవసాయం ఉన్నది. అందరికీ వ్యవసాయమే జీవనోపాధి. గతంలో పంట పండించాలంటే పెట్టుబడి ఖర్చులు చాలా భారంగా అనిపించేది. రైతుబంధు పుణ్యమా అని ఆ కష్టం 90శాతం పోయింది. రైతుబంధు పైసలతో ప్రతి ఏడాది విత్తనాలు, ఎరువులు పంటకు సరిపడా కొనుక్కుంటాం. దున్నకానికి మాకు ప్రభుత్వం సబ్సిడీ మీద ఇచ్చిన ట్రాక్టర్ ఉన్నది. రైతుకు సీఎం కేసీఆర్‌ను దేవుడే పంపినట్టుంది. ఇప్పుడు రైతుబంధు పైసలతో అప్పుభారం తప్పింది. సొంత పొలంల సీఎం కేసీఆర్ ఇచ్చిన పైసలు, బోరు నీళ్లతో మంచిగా పండిస్తున్నాం. సంతోషంగా ఉన్నాం.
రైతుబంధు ఆసరా అయ్యింది..
గజ్వేల్, జనవరి 4: మా ఊరిలో ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నాం. ఊర్ల అందరికీ రైతుబంధు వచ్చిన వాళ్లుంటారు. వారిని చూస్తే రైతుబంధు ధైర్యమేందో తెలుస్తుంది. వేరే గ్రామాల్లో నాకు తెలిసిన వారు చాలా మంది భూములను ఖాళీగానే ఉంచేవాళ్లు. కానీ, రైతుబంధు ప్రారంభంతోనే ఖాళీగా ఉంచిన భూముల్లో సైతం వ్యవసాయం చేస్తున్నారు. నాకు కూడా పొలంలో పనిచేస్తుంటే ఎంతో సంబురంగా అనిపిస్తుంది. మా కుటుంబం మొత్తం 12 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాం.
పంట పెట్టుబడికి డబ్బులు అందినయి..
సీఎం కేసీఆర్ సార్ యాసంగి పంట పెట్టుబడి కోసం డబ్బులను బ్యాంకులో వేసి ఆదుకున్నడు. ఈ మధ్యలో ఎక్కడ కూడా అప్పులు పుడ్తలేవు. అప్పులు ఇచ్చేవాళ్లు కూడా ఇస్తలేరు. ముఖ్యమంత్రి సార్ టైంకు పైసలను అందిస్తుండు. మాకు ఇంతకంటే ఎంగావాలె.
అప్పట్లో పెట్టుబడికి ఇబ్బందులుండేవి..
ఒకప్పుడు పంటలు వేసుకుందామంటే లాగోడికి ఇబ్బందులు పడ్డం. కేసీఆర్ సర్కార్ వచ్చిందంటే మాకు పంట పెట్టబడికి ఇబ్బందులు లేవు. సారే పెట్టుబడికి బ్యాంకులో ఎకరాకు రూ.10 వేలు ఇస్తుండు. ఇంకమాకు అప్పులు లేకుండా విత్తనాలు విత్తుకుంటున్నం.