ప్రశాంత్‌నగర్,మే 11 : అనుమతులు లేకుండా చెట్లు నరికితే చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తామని సిద్దిపేట హరితహారం అధికారి సామల ఐలయ్య హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట పట్ణంలోని 11వ వార్డులో హరితహారంలో నాటిన జామ మొక్కను జూలూరి వెంకటేశం అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా కొట్టివేశాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న హరితహారం అధికారి ఐలయ్య సంబంధిత వార్డు కౌన్సిలర్ దాసరి భాగ్యలక్ష్మి సమక్షంలో చెట్టును కొట్టేసిన వ్యక్తి జూలూరి వెంకటేశంకు రూ. వెయ్యి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారంలో నాటిన చెట్లను కొట్టివేస్తే చర్యలు తప్పవన్నారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. మొక్కలను నాటి చక్కగా సంరక్షించాలని ఆయన సూచించారు.