సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 10: సురభి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ రసాయ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలకు పంటలు సాగు చేసుకోలేక పోతున్నామని హత్నూర మండలం వడ్డేపల్లి గ్రామస్తులు, రైతులు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతికి ఫిర్యాధు చేశారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు ఫిర్యాధులు అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజావాణిలో మొత్తం 48 అర్జీలు అందాయి. దరఖాస్తులను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి స్వీకరించిన కలెక్టర్ వాటిని సకాలంలో పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. బుధవారం బడులు ప్రారంభమవుతాయని గుర్తు చేశారు. తొలిరోజు నుంచే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు అందించాలన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాల ప్రారంభం రోజు ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాలల సభ్యులు, ఉపాధ్యాయులు, పాఠశాలల్లో చేరే విద్యార్థులకు వినూత్నంగా స్వాగతం పలకాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసిందని, అందుకనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినట్టు తెలిపారు. అధికారిక కార్యక్రమాలు, సమావేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ ఆజ్ఞలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్వో పద్మజారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.