రాయపోల్ ఆగష్టు 02 : అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వ సేకరణలో భాగంగా శనివారం రాయపోల్ మండలంలోని వీరా నగర్, వీరారెడ్డిపల్లి, వడ్డేపల్లి, బేగంపేట, సయ్యద్ నగర్, రాంసాగర్, కొత్తపల్లి, రాయపోల్, అనాజీ పూర్ పాఠశాలలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు చేసి పైరవీలకు తావు లేకుండా కౌన్సిలింగ్ సిస్టం తీసుకొచ్చామన్నారు. కానీ ప్రస్తుతం విద్యా శాఖలో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ల ఉత్తర్వులు ఇస్తున్నారని వెంటనే నిబంధనలకు విరుద్ధంగా పైరవీలతో కేటాయించిన డిప్యూటేషన్లు రద్దు చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై నుంచి ప్రకటించాల్సిన పిఆర్ సి ని 40 శాతం పిట్మెంటుతో వెంటనే
ప్రకటించి అమలు చేయాలని, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 5న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కనకయ్య, సీనియర్ నాయకులు కరుణాకర్, మెట్టయ్య, వరప్రసాద్, యాదయ్య, నాగ స్వామి, అమరేందర్, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.