రాయపోల్, మే 9 : రాయపోల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసిందని కేజీబీవీ ప్రిన్సిపాల్ సుగంధలత తెలిపారు. 2025- 2026 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ఒకేషనల్ విభాగంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్డబ్ల్యూ), మెడికల్ ల్యాబోలేటరీ టెక్నాలజీ (ఎంఎల్టీ) కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు కేజీబీవీ పాఠశాలలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టడంతో ఈ ప్రాంత విద్యార్థినిలకు ఎంతో ఉపయోగపడనున్నది.
కాగా, కేజీవీబీ బాలికల ఉన్నత పాఠశాల ప్రస్తుతం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. కేజీబీవీకి పక్కా భవన నిర్మాణ పనులు గత కొన్ని సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్నాయి. ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టడం వలన రాయపోల్ కస్తూర్బా గాంధీ పాఠశాలకు పక్కా భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని మండల ప్రజలు, విద్యార్థినిల తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు స్పందించి కేజీబీవీ నూతన భవనాన్ని పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు