మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి14: మినీ మేడారం ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం పరిధిలోని కూటిగల్ సమ్మక్క-సారలమ్మ జాతరకు కమిటీ సభ్యులు ఆలయాన్ని ముస్తాబు చేశారు. రెండేండ్లకోసారి ‘జానపదులు’ పండుగకు భక్తులు సిద్ధమయ్యారు. కూటిగల్ నల్ల చెరువు చెంతన కొలువుదీరి భక్తుల కొంగు బంగారంగా వాసిల్లుతున్న అమ్మవార్ల జాతర రేపటి నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్నది.
జాతర కార్యక్రమ వివరాలు..
మొదటి రోజు 16వ తేదీన సాయంత్రం 4 గంటలకు సారలమ్మ దేవత గద్దెకు వచ్చుట, 17న సమ్మక్క దేవత గద్దెకు వచ్చుట, 18న సాయంత్రం 4గంటలకు అమ్మవార్లకు మొక్కులు, 19న సాయంత్రం 4గంటలకు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల వనప్రవేశం కార్యక్రమాలు ఉంటాయి.
ఏర్పాట్లు పూర్తి..
కూటిగల్ సమ్మక్క-సారలమ్మ జాతరకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. గద్దెలకు రంగులు, ఆలయ సమీపంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అమ్మవార్ల గద్దెల పరిసరాలు సుమారు కిలోమీటరు దూరం వరకు పరిశుభ్రంగా చేశారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు. గద్దెల చుట్టూ రంగురంగు విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవార్ల పూజల కోసం ప్రత్యేకంగా మేడారం నుంచి కోయ పూజారులు కూటిగల్కు చేరుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు వీలుగా జనగామ, సిద్దిపేట డిపోల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపనున్నారు. అమ్మవార్ల గద్దెల సమీపంలో ఇప్పటికే చిరు వ్యాపారులు తమ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మద్దూరు పోలీసుల ఆధ్వర్యంలో నిఘాను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్కు జాతర కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాలను అందజేశారు. జాతరకు సుమారు 50వేల మంది రానున్నట్లు అంచనా.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి..
మినీ మేడారంగా పిలువబడుతున్న కూటిగల్ సమ్మక్క-సారలమ్మల జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ పంచాయతీ, జాతర కమిటీల ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశాం.
– దోమ బాలమణిబాలకృష్ణ, సర్పంచ్, కూటిగల్
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర కమిటీ ఆధ్వర్యంలో అమ్మవార్ల గద్దెల సమీపంలో అన్ని ఏర్పాట్లు చేశాం. జాతరను విజయవంతం చేసేందుకు కమిటీకి భక్తులు సహకరించాలి. ఉత్సవాల్లో ఏవైనా సమస్యలు వస్తే వెంటనే జాతర కమిటీ దృష్టకి తీసుకురావాలి.
– కొమ్మరాజుల రాజారాం, జాతర కమిటీ అధ్యక్షుడు