న్యూఢిల్లీ : ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్ ధవళిక దేవి కాంస్య పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 50మీటర్ల జూనియర్ రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ధవళిక అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఈ తెలంగాణ షూటర్ 614.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో తొమిరిస్ అమనోవా(620.1), దరా పొనోమరెంకో(615.4) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీలో కోచ్ వినోద్ కనోజియా దగ్గర గత మూడేండ్ల నుంచి ధవళిక దేవి శిక్షణ పొందుతున్నది.
మరోవైపు పురుషుల 25మీటర్ల సెంటర్ ఫైర్ ఈవెంట్లో భారత్‌కు చెందిన అమన్ప్రీత్సింగ్ 589 పాయింట్లతో పసిడి పతకంతో మెరిశాడు. ఇదే విభాగంలో గుర్‌ప్రీత్‌సింగ్(584), అంకుర్ గోయల్(570) రజత, కాంస్యాలు కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేశారు. అదే జోరు కొనసాగిస్తూ టీమ్ ఈవెంట్లోనూ అమన్‌ప్రీత్, గుర్‌ప్రీత్‌సింగ్, అంకుర్ త్రయం 1743 పాయింట్లతో స్వర్ణం దక్కించుకోగా, వియత్నాం(1671) రజతం వశం చేసుకుంది. టోర్నీ మొత్తంగా భారత్ 13 స్వర్ణాలు సహా 11 రజతాలు, 9 కాంస్యాలు ఖాతాలో వేసుకుంది.