గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి 13 : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేసి గ్రామాల రూపురేఖలను మార్చుతున్నది. పల్లెప్రగతితో గ్రామాల్లో కొత్త వాతావరణం కన్పిస్తున్నది. గ్రామాల్లో ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి పంచాయతీ కార్మికులు చెత్తను సేకరిస్తున్నారు. గడిచిన ఏడేండ్లలో మురుగు కాల్వల నిర్మాణం, పాఠశాల, అంగన్వాడీ భవనాల నిర్మాణాలు చేపట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషితో గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.9.90 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, కొం డపాక, ములుగు, వర్గల్, మర్కూక్ మండలాల్లో కొత్తగా నిర్మించే సీసీ రోడ్లకు ప్రభుత్వం రూ.9.90 కోట్లను మం జూరు చేసినట్లు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ముఖ్యకార్యదర్శి ప్రకటించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో ఇప్పటికే చాలా వరకు సీసీ రోడ్లు, మురు గు కాల్వల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ కృషితో నేడు గజ్వేల్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిని చూసేందుకు అధికారుల బృందాలు పర్యటించారు. నేడు గ్రామా ల్లో ఎక్కడ చూసినా పచ్చదనంతో హరితహారం మొక్కలు కన్పిస్తున్నాయి. గ్రామాల్లోకి ప్రవేశించే రోడ్డు మార్గానికి ఇరువైపులా మొక్క లు ఆకట్టుకునేలా ఉన్నాయి. గజ్వేల్ మండలానికి రూ. 1.80 కోట్లు, జగదేవ్‌పూర్ మండలానికి రూ.1.55 కోట్లు, కొండపాక మండలానికి రూ.1.80 కోట్లు, మర్కూక్ మండలానికి రూ.1.25 కోట్లు, ములుగు మండలానికి రూ.1.70 కోట్లు, వర్గల్ మండలానికి రూ.1.80 కోట్ల నిధు లు మంజూరు కావడంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా అభివృద్ధి..
సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా నేడు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయితే ప్రజల ఇబ్బందులు తీరుతాయి. పల్లెప్రగతి భాగంగా గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. ప్రతిరోజూ పారిశుధ్య కార్మికులు వీధులను శుభ్రం చేస్తున్నారు.
– మాదాసు అన్నపూర్ణ, ఏఎంసీ చైర్పర్సన్
గ్రామాలకు కొత్త కళ వస్తుంది.
సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే గ్రామాలకు కొత్త కళ వస్తుంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. నేడు సమస్యలు లేని గ్రామాలుగా మారాయంటే అది కేవలం సీఎం కేసీఆర్ కృషే అని చెప్పాలి.
– చెరుకు చంద్రమోహన్‌రెడ్డి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు